న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ న్యూఢిల్లీలో అడుగుపెట్టారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు.
2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత షీ జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. మోదీ-జిన్‌పింగ్ భేటీలో వాస్తవాధీన రేఖ (LAC) వద్ద పరిస్థితులు, సరిహద్దు సాధారణీకరణ, వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, పెట్టుబడులు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఇరు దేశాల మధ్య సంబంధాల్లో చోటుచేసుకున్న పురోగతిని కూడా నేతలు సమీక్షించనున్నారు.
గల్వాన్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలను క్రమంగా సాధారణ స్థితికి తీసుకురావడానికి 2024 నుంచి ఇరు దేశాలు పలు చర్యలు చేపట్టాయి. సరిహద్దుల్లో సైనిక బలగాల ఉపసంహరణతో పాటు వీసాలు, వాణిజ్యం, ప్రత్యక్ష విమాన సర్వీసుల విషయంలోనూ పురోగతి నమోదైంది.
ఇదిలా ఉండగా, జిన్‌పింగ్ పర్యటన నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రిక్స్ సదస్సు వేదిక భారత్ మండపం పరిసరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. జిన్‌పింగ్ పర్యటన భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో తదుపరి దశకు నాంది పలుకుతుందా అన్నది మోదీతో జరిగే భేటీపై ఆసక్తిని పెంచుతోంది.
/span>

