గుంటూరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా తనకు బీసీ కులధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా తహసీల్దార్ అర్జీని తిరస్కరించారంటూ గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ టీడీపీ అభ్యర్థి షేక్ జబీన్ చేసిన అప్పీల్‌ను గుంటూరు కలెక్టర్ తిరస్కరించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ వివేక్‌యాదవ్ విచారణ జరిపి వివిధ కారణాలను పేర్కొంటూ జబీన్ అప్పీల్‌ని తిరస్కరిస్తున్నట్టు 38 పేజీల నివేదికలో పేర్కొన్నారు. తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా ద్వారా విచారణ జరిపించినట్లు కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. విచారణలో జబీన్ తాను మొహమ్మద్ కులానికి చెందినట్టు పేర్కొన్నారు. సర్టిఫికెట్ మాత్రం షేక్ కులానికి చెందినది కావాలని అర్జీ పెట్టుకొన్నారు. జబీన్ తల్లిదండ్రులు, సోదరులు మొహమ్మద్‌లుగా, భర్త తరపు బంధువులు షేక్‌లుగా ఉన్నారని పేర్కొన్నారు. మొహమ్మద్‌లు కూడా షేక్‌ల కిందకే వస్తారన్న నిబంధన ప్రభుత్వ ఉత్తర్వుల్లో లేదని చెబుతూ జబీన్ అప్పీల్‌ని తిరస్కరిస్తున్నట్టు స్పష్టంచేశారు. కాగా.. కలెక్టర్ కోర్టులోనూ తనకు అన్యాయం జరిగిందని తాను తిరిగి హైకోర్టును ఆశ్రయిస్తానని జబీన్ పేర్కొన్నారు.
