ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 2: జిల్లాలోని తిరువూరు పట్టణంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరువూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికుల ఆధ్వర్యంలో నిర్వహించిన పవన్ పుట్టినరోజు వేడుకల్లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్(చిన్ని ) పాల్గొన్నారు.
భారీ కేక్‌ను కట్ చేసి ఉపముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దుష్ట పరిపాలన అంతం కోసం పవన్ కల్యాణ్ చేసిన కృషి మరువలేనిదన్నారు.
ఎటువంటి లాభాలను ఆశించకుండా కూటమిగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అలోచించిన గొప్ప వ్యక్తి పవన్ కల్యాణ్ అని కొనియాడారు. యువత అంతా ఆయన్నే ఆదర్శంగా తీసుకుని నడవాలని సూచించారు. పవన్ చేసే ప్రతి పని రాష్ట్రం, ప్రజల ప్రయోజనం కోసమే అని స్పష్టం చేశారు. టీడీపీ కష్టకాలంలో కూడా అండగా నిలబడిన గొప్ప వ్యక్తి పవన్ అని అన్నారు. ఇలాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరమని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మైత్రి చాలా గొప్పదని.. ఆ మైత్రితోనే కుటమి నాయకులంతా కలిసి కట్టుగా నడవాలని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.

