Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఐ చేతులెత్తేస్తే.. మనుషులే దిక్కయ్యారు!

ఏఐ చేతులెత్తేస్తే.. మనుషులే దిక్కయ్యారు!

  • 350 మందిఇంజనీర్లను మళ్లీ నియమించుకున్న ఫోర్డ్‌ కంపెనీ

  • నాణ్యత తనిఖీలు చేసే ఇంజనీర్ల స్థానంలో నిరుడు అక్టోబరులో 900 ఏఐ కెమెరాల ఏర్పాటు

  • ఆశించిన స్థాయిలో పూర్తికాని పని

  • అనుభవజ్ఞులైన ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్న సంస్థ

న్యూయార్క్‌, జూన్‌ 29: ప్రపంచమంతా కృత్రిమ మేధ (ఏఐ) వెంట పరుగులు తీస్తున్న క్రమంలో.. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్‌ కూడా అదే బాట పట్టింది! కానీ.. అనుభవజ్ఞులైన ఇంజనీర్ల ప్రతిభాపాటవాల ముందు ఏఐ తేలిపోవడంతో.. మళ్లీ సదరు ఇంజనీర్లనే తిరిగి నియమించుకుంటోంది! బ్లూమ్‌బెర్గ్‌ వార్తాసంస్థ కథనం ప్రకారం.. ఫోర్డ్‌ కంపెనీకి చెందిన అత్యంత అనుభవజ్ఞులైన నాణ్యత తనిఖీ ఇంజనీర్లు గత కొంతకాలంగా రకరకాల కారణాలతో కంపెనీని విడిచి వెళ్లారు. అయితే, ఆ సంస్థ వారి స్థానంలో కొత్తవారిని నియమించుకోకుండా.. నిరుడు అక్టోబరులో 900 ఏఐ ఆధారిత కెమెరాలను క్వాలిటీ ఎస్యూరెన్స్‌ విభాగంలో ఏర్పాటు చేసింది. ఆ సమయంలో ఫోర్డ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కుమార్‌ గల్హోత్రా ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ''మొత్తం పారిశ్రామిక వ్యవస్థ అంతటా ఏఐ విస్తరిస్తోంది'' అని గొప్పగా చెప్పారు కూడా. ''చాలామంది వైట్‌ కాలర్‌ ఉద్యోగులను ఏఐ వెనక్కి నెట్టేస్తోంది'' అని ఫోర్డ్‌ చీఫ్‌ జిమ్‌ ఫార్లే కూడా అన్నారు. కానీ.. ఏడాది తిరగకుండానే వారిద్దరి అంచనాలూ తప్పయ్యాయి. దీంతో.. పాత ఇంజనీర్లను మళ్లీ నియమించుకోవడం మొదలుపెట్టింది. అలా ఇప్పటిదాకా దాదాపు 350 మంది ఇంజనీర్లను నియమించుకున్నట్టు సంస్థ వెల్లడించింది. తాము ఏర్పాటుచేసిన కృత్రిమ మేధకు శిక్షణ ఇచ్చే పనిని వారికి అప్పగించింది. ''కృత్రిమ మేధ నిజంగా ఒక అద్భుతమైన సాధనం. కానీ.. దాని పనితీరు దానికి మనం ఇచ్చే శిక్షణను బట్టే ఆధారపడి ఉంటుంది'' అని ఫోర్డ్‌ వెహికల్‌ హార్డ్‌వేర్‌ ఇంజనీరింగ్‌ ఉపాధ్యక్షుడు చార్లెస్‌ పూన్‌ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా.. తమ సంస్థలో ఉన్న అత్యంత అనుభవజ్ఞులైన ఉద్యోగులకు తాము ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అంగీకరించారు. వారి స్థానంలో నియమించిన ఏఐ ఆధారిత వ్యవస్థ ఆశించిన స్థాయిలో పనిచేయలేదని విలేకరులకు చెప్పారు. ''కేవలం కృత్రిమ మేధను ప్రవేశపెట్టి.. మాకున్న డిజైన్‌ అవసరాలను దానికి ఇన్‌పుట్‌గా ఇస్తే అది అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తిని తయారుచేస్తుందని మేం తప్పుగా భావించాం'' అని ఆయన తాము చేసిన తప్పును ఒప్పుకొన్నారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్లకు ఉన్న నైపుణ్యం, శిక్షణ కృత్రిమ మేధకు లేకపోవడమే ఈ వైఫల్యానికి కారణమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే.. వాటికి మరింత మెరుగుపరచడానికి అత్యంత అనుభవజ్ఞులైన నిపుణుల ద్వారా శిక్షణ ఇప్పించాలనే నిర్ణయానికి వచ్చి పాత ఇంజనీర్లను, వారితోపాటు మరికొంత మంది యువ ఇంజనీర్లను కూడా నియమించుకున్నట్టు పూన్‌ వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy