జనరల్
ఏఐ ఒక అవసరం, సామర్థ్య పటిమ, అంతే తప్ప ప్రత్యేకం ఎంతమాత్రం కాదు. సివిల్, మెకానికల్ సహా బ్రాంచ్ ఏదైనప్పటికీ ఏఐ వర్కింగ్ లిట్రసీ తెలిసి ఉండాలి.
లాంగ్వేజ్ మోడల్స్ ఎలా రూపుదిద్దుకుంటాయి, నేర్చుకుంటాయి, నైతిక హద్దులు - టూల్స్‌గా ఎలా ప్రయోగించాలి వంటివన్నీ తెలుసుకోవాలి. ఏఐ ఒక కోర్సు కాదు. మ్యాథ్స్, కమ్యూనికేషన్ మాదిరిగానే ఏఐ కూడా కరిక్యులమ్‌పై ఒక పొర మాదిరిగా కొనసాగుతూ ఉంటుంది.
జవాబులు ఇవ్వడంలో ఏఐ తన ప్రావీణ్యాన్ని కనబరుస్తుంది. ప్రాబ్లెమ్‌కు సరైన ప్రశ్నను రూపొందించడంలో మానవులు విజయం సాధించాలి. అందుకుగాను ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు డీప్ ప్రాబ్లెమ్ ఫార్ములేషన్ నైపుణ్యాలను అలవర్చుకోవాలి. వాస్తవంగా ఎదురయ్యే సమస్యలను చిన్న ముక్కలుగా విడదీయగలగాలి. వాటిని సరైన విధంగా ప్రశ్నించి సమాధానాలను రాబట్టగలగాలి. చివరగా వాటన్నింటినీ కలుపుకోగలగాలి. ఈ నేపథ్యంలో ఏఐ ఎక్కడ తప్పుడు టూల్ అన్నదీ గుర్తించాలి. అలా ఏఐని ఎక్కడ ఉపయోగించకూడదో తెలుసుకోవాలి.
ఏడాదిన్నరకు ఒకసారి టూల్స్ మారుతుంటాయి. అదో సహజ పరిణామం. అందుకే విద్యార్థులు ఫండమెంటల్స్‌ను ప్రాథమిక స్థాయి నుంచి నేర్చుకోవాలి. థెర్మోడైనమిక్స్, అల్గోరిథమ్స్, సర్క్యూట్స్, ఎకనామిక్స్ మొదలైన వాటిని పునాది నుంచి తెలుసుకోవాలి. ఫ్రేమ్ వర్క్స్ వెనక పరుగులు పెట్టకూడదు. అందుకుబదులు సరికొత్త మార్పులకు అనుగుణంగా తమకు తాము మార్చుకోగలగాలి.
మానవుడి సహజ నైపుణ్యాలను ఏఐ అనుకరించలేదు. డేటా సరిపోనప్పుడు అనిశ్చిత పరిస్థితుల్లోనే జడ్జిమెంట్ ఉంటుంది. వెతుకలాటలోనే పక్షపాతం, ప్రైవసీ అలాగే జవాబుదారీతనం లోపిస్తే ఎథికల్ రీజనింగ్ దెబ్బతింటుంది. ముందుకు కదలడం, ఏమీ చెప్పకపోవడం వంటి పరిస్థితుల్లో ఒత్తిడి, కథలు చెప్పడం పరిపాటి. ఇంటర్‌డిసిప్లినరీ టీమ్స్‌ను లీడ్ చేస్తున్నప్పుడు సహానుభూతి, సహయోగం అవసరమవుతాయి. ఏది విలువైనదో, అర్హమైనదో తెలుసుకునేందుకు అభిరుచి, సృజనాత్మకత కావాల్సి వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ ఏమీ చేయలేదు.
ఏఐతో వాస్తవాలను నిర్మించుకోవాలి. ప్రాడక్ట్, వర్క్‌ఫ్లో, రీసెర్చ్, సామాజిక ప్రయోజనాలకు అనుగుణంగా అదంతా ఉండాలి. ఇందులో అనుభవం అంటే ఎవరికివారు పొందాలి. అంతే తప్ప లెక్చరర్లు చెప్పరు.
నేర్చుకున్న లేదా తెలుసుకున్న నైపుణ్యాలకు మనుగడ తక్కువ. ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకునేందుకు అలవడాలి. అందుకోసం నిత్య విద్యార్థిగా మారాలి.
. అన్నింటినీ ఏఐ మారుస్తున్న నేపథ్యంలో వాస్తవ ప్రపంచంలో మానవాళికి అదెంతవరకు ప్రయోజనం అన్నదీ నైతిక ధృక్కోణంలో ఆలోచించగలగాలి.
ఏఐ యుగంలో కోడ్ రాసే వ్యక్తులుగానే పరిమితం కాకూడదు. పరిస్థితులకు అనుగుణంగా మారాలి. నైతిక విలువలను జోడించుకుంటూ సమస్యలను సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తులుగా ఎదగాలి. మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వ్యక్తిగతంగా ఆలోచన సామర్థ్యాన్ని పెంచే సాధనంగా ఏఐని ఉపయోగించుకోవాలి.
ఇంజనీరింగ్ కోర్సులో సెమిస్టర్ విధానాన్ని అవలంభిస్తారు. ఇంటర్లో మాదిరిగా సాధారణంగా చదువుకోవడంతో ఇక్కడ పని పూర్తి కాదు. ప్రతి సెమిస్టర్‌లో రెగ్యులర్ స్టడీకి తోడు అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు, టెస్టులతో తీరిక చిక్కని వ్యవహారంగా లెర్నింగ్ ఉంటుంది. ప్రొఫెసర్ నుంచి స్పూన్‌ఫీడింగ్‌ను ఆశించకూడదు.
ప్రశ్నించేందుకు భయపడొద్దు. ప్రొఫెసర్ చెప్పినవన్నీ అందరికీ అర్థం కావాలని లేదు. బోర్డుపై రాసిన కాలిక్యులేషన్ ఎలా వచ్చిందో తెలియకపోవచ్చు. గీసిన స్కెచ్ ఏమిటో అవగతం కాకపోవచ్చు. వెంటనే ప్రశ్నించి సందేహాన్ని తొలగించుకోవాలి. అందుకు ప్రొఫెసర్ ఏమీ అనుకోరు. కోపగించుకోరు. చక్కగా వినడమే కాకుండా, అర్థం కానిది అడుగుతున్నందుకు సంతోషిస్తారు. మరోసారి విడమర్చి చెబుతారు. విషయం ఏదైనా సరే, తరగతి గదిలో కాకుంటే బైట వీలు చూసుకుని అడగవచ్చు. 'క్లాస్‌లో థియరీ నేర్చుకుంటున్నాం, రియల్ వరల్డ్‌లో దీన్ని ఎలా అన్వయించాలి, ఎందుకు ఉపయోగపడుతుంది వంటివి అడిగి మరీ తెలుసుకోవాలి.
సాధారణంగా కొన్ని పాఠ్య పుస్తకాల్లో మెటీరియల్ ప్రాక్టికల్ ఇలస్ట్రేషన్స్, వివరణలతో ఉంటుంది. వాటి కోసం ప్రయత్నించండి. సెకండ్ రిఫరెన్స్ మరో మంచి వ్యూహం. అలా చదివితేకలకాలం గుర్తుంటుంది. బేసిక్స్ మీద పట్టు ఏర్పడుతుంది.
ఇతర విద్యార్థులతో కలిసిమెలసి వర్క్ చేయడం చాలా మంచిది. ఏదైనా ప్రాబ్లెమ్ సాల్వింగ్‌ను ఒక్కరే చేపట్టినప్పుడు ఎక్కడైనా ఆగాల్సి రావచ్చు. అలాంటివి అందరూ కలిసి చేస్తే బాగుంటుంది. గ్రూపులో ఎవరో ఒకరు వేగంగా చేసే సత్తా కలిగి ఉంటారు. ఒక్కోదాంట్లో ఒకరు నిష్ణాతులు కావచ్చు. అలాంటి వారు ఉండటం వల్ల, ఆగిన చోట నుంచి ముందుకు కదిలేందుకు వీలుపడుతుంది. అప్పటికీ రాకుంటే ప్రొఫెసర్ ఎలాగూ ఉంటారు.
గ్రూపులో కొందరు విద్యార్థులు వీక్‌గా ఉంటారు. వారిని ఎంకరేజ్ చేయాలి. అందుకు ఒక మార్గం ఉంది. ప్రాబ్లెమ్‌కు సొల్యూషన్ దొరికిన తరవాత ఆ వీక్ విద్యార్ధి మొత్తం వివరించేలా ప్రోత్సహించాలి. అప్పుడు తను కూడా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాడు.
ఇంజనీరింగ్ అంటే ఎవరికి వారు చేసుకునే పని ఎంతమాత్రం కాదు. నాయకత్వం వహించగలగాలి. టీమ్ వర్క్ తెలిసి ఉండాలి. అందుకోసం కాలేజీలో ఉండగానే నెట్‌వర్క్ ఏర్పాటుపై కూడా దృష్టి సారించాలి. టీచర్స్ సహా అలూమ్నీతో మంచి సంబంధాలను నెరుపుకోవాలి.
కాలేజీలో నిర్వహించే సెమినార్లు, లెక్చర్స్ ఇతరత్రా సదస్సుల్లో పాల్గొనాలి. అక్కడికి వచ్చే అతిథులను పర్సనల్‌గా కలవాలి. సోషల్ మీడియాను అందుకు ఉపయోగించుకోవాలి.
.పుస్తకం లేదంటే టీచర్లు చెప్పింది తెలుసుకున్న పరిజ్ఞానాన్ని మదిలో నిలుపుకోవాలంటే అందుకు సరైన దారి ఇంటర్న్‌షిప్. పోర్టుఫోలియోలో చేర్చుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. కోర్సులో ఉన్న అండర్‌గ్రాడ్యుయేట్లను తీసుకునే ఎంప్లాయిర్లను తెలుసుకోవాలి. సమ్మర్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు ప్రయత్నించాలి. అది తదుపరి సెమిస్టర్‌కు ఉపయోగపడుతుంది.

ప్రొఫెసర్ ఎన్.వి.రమణారావు
డైరెక్టర్, ఎన్‌ఐటీ, రాయ్‌పూర్

