Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఏఐ'తో ఉద్యోగ కోతల కన్నా.. నైపుణ్యాల మార్పే అధికం!

'ఏఐ'తో ఉద్యోగ కోతల కన్నా.. నైపుణ్యాల మార్పే అధికం!

  • 82 శాతం సంస్థలు ఎఫిషియెన్సీ కోసం ఏఐ వినియోగం

  • బ్యాంకింగ్‌, బీమా, ఫిన్‌టెక్‌, మూలధన మార్కెట్‌లలో అధికం

  • 'ఏఐ'లో పెట్టుబడులకూ పెరుగుతున్న ఆసక్తి: ఐఎఫ్ఎస్‌సీఏ సర్వే

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు భారీగా తగ్గిపోతున్నాయని వింటున్న తరుణంలో.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని తాజాగా ఓ సర్వే వెల్లడించింది. ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ (ఐఎ్‌ఫఎ్‌ససీఏ) విడుదల చేసిన 'ఏఐ సర్వే-2026' నివేదిక ప్రకారం.. సంస్థలు ఉద్యోగ కోతల కన్నా నైపుణ్యాల (రీస్కిల్లింగ్‌) మార్పుపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న 32 శాతం సంస్థలు, ఏఐ వల్ల ఉద్యోగాల సంఖ్య తగ్గడం కంటే ఉద్యోగుల పనుల స్వభావం మారుతూ, రీ-స్కిల్లింగ్‌ అవసరం పెరుగుతుందని అభిప్రాయపడ్డాయి.

మరో 10 శాతం సంస్థలు కొత్త ఉత్పత్తులు, సేవల విస్తరణతో అదనపు ఉద్యోగ అవకాశాలూ పెరుగుతాయని అంచనా వేశాయి. బ్యాంకింగ్‌, బీమా, ఫిన్‌టెక్‌, మూలధన మార్కెట్‌ రంగాల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపించనున్నట్లు పేర్కొన్నాయి. సంస్థలు ఏఐని స్వీకరించడానికి ప్రధాన కారణంగా 'పనితీరు మెరుగుదల' నిలిచింది. 2026లో 82శాతం సంస్థలు ఆపరేషనల్‌ ఎఫిషియెన్సీ కోసం ఏఐని వినియోగిస్తున్నట్లు తెలిపాయి. అంతర్గత ప్రక్రియలు, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, కంప్లయెన్స్‌ వ్యవస్థల్లో ఆటోమేషన్‌ పెంపు ప్రధాన లక్ష్యంగా మారింది. ఇతర కారణాలను పరిశీలిస్తే ఖర్చుల తగ్గింపు, కస్టమర్‌ సేవల మెరుగుదల, పోటీ సామర్థ్య పెంపు ఉన్నాయి. ప్రస్తుతం 57 శాతం సంస్థల్లో ఉద్యోగులు ఏఐ సాధనాలను వినియోగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

ఏఐ రంగంలో పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతోంది

ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకూ చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టగా, మరికొన్ని విస్తరణ దశలో ఉన్నాయి. ఇంకొన్ని సంస్థలు సిద్థమవుతున్నాయి. ఇది ఏఐపై పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ఇక జెనరేటివ్‌ ఏఐ వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. సుమారు 65 శాతం సంస్థలు ఈ టెక్నాలజీని పరిశీలించడం లేదా అమలుచేయడం ప్రారంభించాయి. అయితే, ఏఐ అమలులో కొన్ని సమస్యలూ ఉన్నాయి. ముఖ్యంగా డేటా నాణ్యత, నియంత్రణలో స్పష్టత లేకపోవడం ప్రధాన అడ్డంకిగా నిలుస్తోంది. అదనంగా నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత, గవర్నెన్స్‌ వ్యవస్థల లోపం వంటి అంశాలు కూడా సవాళ్లుగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. అందుకే డేటా ప్రైవసీ సమస్యలను దృష్టిలో పెట్టుకుని సంస్థలు గవర్నెన్స్‌ విధానాలను బలోపేతం చేస్తున్నాయి.

>

6 మోడళ్లతో పీపీపీ పాలసీ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

మద్యం పాలసీ రెన్యువల్‌?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy