Friday, 02 Oct, 3.03 am ఆంధ్రజ్యోతి

ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
ఏడాదైనా అంతే!

కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంలో అర్హత ఉన్నప్పటికీ 25 మందికి కాపునేస్తం, 40 మందికి వైఎ్‌సఆర్‌ చేయూత, 18 మందికి పెన్షన్‌ మంజూరు కాలేదు. వీరంతా గ్రామ సచివాలయంలో ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాసుపుస్తకం తదితరాల జిరాక్స్‌ కాపీలు అందజేశారు. అయినా ఎందుకు మంజూరు కాలేదని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం లేదు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా 'నాట్‌ డాక్యుమెంటేషన్‌ సబ్‌మిటెడ్‌' అని వచ్చింది. వాస్తవానికి వీరంతా టీడీపీ సానుభూతిపరులు. వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్లే వీరి పత్రాలు సరిగా నమోదు చేయలేదని తెలుస్తోంది.

అనంతపురం జిల్లాలో 1207 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. సచివాలయాల ద్వారా సేవలందించడంలో ఈ జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. అయితే, జిల్లాలో ఇప్పటి వరకూ 14,32,324 మందికి సేవలందించినట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే ఒక్కో సచివాలయం ద్వారా రోజుకు సగటున 3-4 సేవలు మాత్రమే అందిస్తున్నారని అర్థమవుతోంది.

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి శుక్రవారానికి ఏడాది పూర్తవుతోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ 'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే' అన్న చందంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది ఫుల్‌..పనులు నిల్‌' అన్న ధోరణిలో సచివాలయాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించి.. గ్రామ, వార్డుల్లోని కుటుంబాల గుట్టును రెండన్నర లక్షల మంది వలంటీర్ల చేతిలో పెట్టారనే విమర్శలు వెల్లువెత్తాయి. సుమారు లక్ష మంది ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోకుండా వలంటీర్లకు రిమోట్‌ కంట్రోల్‌గా మార్చేశారని ఆరోపిస్తున్నారు. పింఛన్ల పంపిణీ తప్ప మరే సేవ అందించని ఈ వ్యవస్థను ప్రజల నెత్తిన రుద్దారన్న విమర్శలున్నాయి. వైసీపీకి చెందిన కుటుంబాల కోసమే వారు పనిచేస్తున్నారని, మిగతావారికి ఉపయోగపడటం లేదంటున్నారు.

500 రకాల సేవలు అన్నా...

గ్రామ, వార్డు సచివాలయాల్లో 500 రకాల సేవలు ప్రారంభించామంటూ ఆర్భాటం చేసి ఏడాది అవుతున్నా, ఇంకా చాలా సచివాలయాల్లో పూర్తి స్థాయిలో ఇంటర్నెట్‌, సాంకేతిక సౌకర్యాలు లేవంటున్నారు. సిబ్బందిలో సమన్వయ లేమి, వారికి మార్గదర్శకం చేసే వ్యవస్థ ఇంకా వేళ్లూనుకోకపోవడంతో సచివాలయాలు నామమాత్రంగా మిగిలాయి. మీ-సేవ ద్వారా అందాల్సిన సేవలను కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించడం ప్రారంభించినప్పటి నుంచి సర్టిఫికెట్లు అందడం కూడా ఆలస్యమవుతోందంటూ అసంతృప్తి వ్యక్తమవుతోంది.

మరోవైపు తమపట్ల ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇక్కడ ఉద్యోగులుగా చేరడం తాము చేసుకున్న పాపమా? అంటూ పలువురు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. జాబ్‌చార్ట్‌పై రోజుకో రకంగా ఉత్తర్వులు మార్చడంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో చేరిన లక్షమందికిపైగా ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. వీఆర్వోలు నామమాత్రంగా సచివాలయాలకు వచ్చినా పౌరసేవలు మాత్రం తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి అందిస్తున్నారు. రెవెన్యూ సమస్యలకు గ్రామ సచివాలయాల్లో పరిష్కారం లభించడం లేదు. మహిళా పోలీసు ఏం విధులు నిర్వర్తిస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. ఎప్పటిలాగే ఏఎన్‌ఎంలు డాక్టర్ల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. డిజిటల్‌ అసిస్టెంట్‌, పంచాయతీ కార్యదర్శి తప్ప ప్రతి ఒక్కరు ఆయా శాఖల పర్యవేక్షణలోనే పనిచేసుకుంటున్నారు. ఆయా శాఖలకు మాత్రమే వారు బాధ్యత వహిస్తున్నారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలు ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదని పలువురు ఉద్యోగులే పేర్కొంటున్నారు.

గౌరవం లేని ఉద్యోగాలు..

ప్రభుత్వం వలంటీర్లకు ఇచ్చిన గౌరవం కూడా సచివాలయ ఉద్యోగులకు లేకుండా చేసిందని పలువురు వాపోతున్నారు. రెండేళ్ల అప్రెంటిస్‌షిప్‌ పేరుతో కేవలం రూ.15 వేలు గౌరవ వేతనం అందిస్తున్నారు. దీంతో తర్వాత ఏదో ఒక ఉద్యోగం రావడంతో వారంతా రిజైన్‌ చేసి వెళ్లిపోతున్నారు. మరి కొంతమంది ఉద్యోగులు అప్రెంటి్‌సషిప్‌ పూర్తి కాకముందే తమను డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ రామయనడంపై ఆందోళన చెందుతున్నారు. రాత పరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన వేలమంది ఇంకా అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అందక ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి, సెప్టెంబరు 20 నుంచి పరీక్షలు నిర్వహించడం తమకు అన్యాయం చేయడమేనని వారు పేర్కొంటున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top