విశాఖ: జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాదని, దోచుకోవడం, దాచుకోవడమే వాళ్ళ ఏజెండా అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. శనివారం విశాఖలోని పాత గాజువాకలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లా శ్రీనివాస్ అమరణ నీరాహార దీక్ష చేసి స్టీల్ ఫ్లాంట్ ఉద్యమానికి ఊపిరి పోశారని కొనియాడారు. ప్రశ్నించేవారిపై ఈ ప్రభుత్వం కేసులు పెడతోందని, టీడీపీ కార్యకర్తలుపై కేసులు పెట్టడమే కాకుండా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల బట్టలు విప్పించే రోజు తొందర్లోనే వస్తుందన్నారు. చెత్త, పనికిమాలిన సర్కార్ రాష్ట్రాన్ని పాలిస్తోందని, ఇలాంటి ప్రభుత్వం అవసరమా? అని ప్రశ్నించారు.
పన్నులు పేరుతో ప్రజలు సొమ్మును దోచుకుంటున్నారని, ఫేక్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ శోభను పెంచామని చంద్రబాబు అన్నారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ మోహన్ రెడ్డితో కలిసి పోరాడదాం అని చెప్పానన్నారు. ఇప్పటి వరకు సీఎం స్పందించలేదన్నారు. ముఖ్యమంత్రి విశాఖ వచ్చి దొంగ స్వామి దగ్గరకు పోయి వొంగి వొంగి దండాలు పెడతారని విమర్శించారు. జగన్ దొంగ పాదయాత్ర చేశారని, పాదయాత్రలో భూములు ఎక్కడ ఉన్నాయో సర్వే చేసుకున్నారన్నారు. అన్నా క్యాంటీన్, నిరుద్యోగ భృతి పోయిందని, అమ్మఒడి, నాన్న బుడ్డీ కోసం మాత్రమే మాట్లాడుతారని అన్నారు. వైసీపీ అభ్యర్థులు అంతా నేర చరిత్ర ఉన్నవారేనని ఆరోపించారు. గాజువాకలో ముగ్గురు ఎమ్మెల్యేలు.. కానీ పల్లా శ్రీనివాస్ దగ్గర వాళ్ళ ఆటలు సాగవన్నారు. విశాఖకు పట్టిన శని ఏ2ను వదిలించుకోవాలని పిలుపు ఇచ్చారు. బూతుల మంత్రి ఒకరు, హావాలా మంత్రి ఒకరు, కొబ్బరికాయల మంత్రి ఒకరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

