హైదరాబాద్: మాజీ మంత్రి ఈటలపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీతో పాటు ఈటల కూడా మునిగిపోతారని ఆయన జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను విమర్శించే హక్కు ఈటలకు లేదన్నారు. బీజేపీలో ఈటలకు ఏం కనిపిందోనని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గానికి ఈటల ఏం చేశారని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ను వీడిన వాళ్లే నష్టపోతారన్నారు. పార్టీకి ఎలాంటి నష్టం జరగదని జగదీశ్ రెడ్డి తెలిపారు.
''ప్రత్యేక ఎజెండాతోనే ఈటల బీజేపీలో చేరారు. రాజకీయాల్లో విభేదాలు రావడం సహజం. హిట్లర్ వారసుల వద్దకు చేరి నియంతృత్వం మీద పోరాడుతాననడం నేతి బీరలో నెయ్యి వెతికినట్లే. ఈటల మునిగిపోయే పడవ ఎక్కుతున్నారు.
కాగా ఈటల రాజేందర్ సోమవారం ఉదయం 11.30 గంటలకు బీజేపీలోకి చేరారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ అధినేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణలో ఈటల వర్సెస్ టీఆర్ఎస్ నేతలుగా మారింది.

