Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎంపీ ల్యాడ్స్ నిధులపై అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్

ఎంపీ ల్యాడ్స్ నిధులపై అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్

రీంనగర్: ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపై ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ విడుదల చేసిన నివేదికపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేటాయిస్తున్న ఎంపీ ల్యాడ్స్ నిధులను వినియోగించుకోవడంలో పార్లమెంట్ సభ్యులు పూర్తిగా వెనుకబడ్డారన్న ఆ సంస్థ నివేదిక సత్యదూరమని బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ కింద పంపిన ప్రతిపాదనలకు సంబంధించి పనుల పురోగతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎంపీలపై అభాండాలు వేయడం సరికాదని పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ ల్యాడ్స్ కింద రూ.17.50 కోట్లు కేటాయించగా.. అందులో ఇప్పటికే రూ.16.47 కోట్లు వినియోగించామని ఆయన స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన వివరాలను గణాంకాలతో సహా బండి సంజయ్ మీడియాకు వివరించారు.

'కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి గత మూడేళ్లలో కమ్యూనిటీ హాళ్లు, బోర్‌వెల్స్, హైమాస్ట్ లైట్లు, సీసీ రోడ్ల నిర్మాణాల కోసం స్థానిక ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 627 ప్రతిపాదనలు కలెక్టర్‌కు పంపాం. ఇందులో కరీంనగర్ జిల్లా నుంచి 313, హన్మకొండ నుంచి 39, జగిత్యాల నుంచి 45, రాజన్న సిరిసిల్ల నుంచి 151, సిద్దిపేట నుంచి 79 పనులకు సంబంధించిన ప్రతిపాదనలున్నాయి. వీటిలో 82.29 శాతం పనులకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆమోదం తెలిపారు. మిగిలిన పనుల మంజూరు అంశం ప్రాసెస్‌లో ఉంది. మొత్తంగా కేంద్రం కేటాయించిన రూ.17.5 కోట్లలో 94.1 శాతం మేరకు అంటే రూ.16.47 కోట్ల నిధులకు సంబంధించిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి' అని కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో 16వ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగిన బోయినపల్లి వినోద్ కుమార్ తన ఐదేళ్ల కాలంలో వినియోగించని రూ.2.5 కోట్లను సైతం తాను ఖర్చు చేసినట్లు బండి సంజయ్ తెలిపారు.

వాస్తవానికి స్థానిక సమస్యల పరిష్కారానికి సంబంధించి కేంద్రం ఏటా కేటాయిస్తున్న ఎంపీ ల్యాడ్స్ నిధులు సరిపోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా నిధులను ఏటా పెంచాలని కోరుతూ ఇప్పటికే ఎంపీల నుంచి కేంద్రానికి అనేక విజ్ఞప్తులు వెళ్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ ఎంపీ ల్యాడ్స్ నిధులే ఖర్చు చేయడం లేదంటూ ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ ప్రచారం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల కేటాయింపు, ఎంపీల ప్రతిపాదనలు, జిల్లా కలెక్టర్ల ఆమోదం, వివిధ శాఖల అధికారుల కార్యాచరణ, అమలు, పనుల పూర్తి వరకు అనేక దశలు ఉన్నాయని తెలిపారు. ఇవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా పార్లమెంట్ సభ్యులు ఎంపీ ల్యాడ్స్ నిధులనే వినియోగించుకోవడం లేదని ఆరోపణ చేయడమంటే బట్ట కాల్చి మీద వేయడమేనని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 7 నెలల సమయం ఉన్నప్పటికీ తన వద్ద ఎంపీ ల్యాడ్స్ నిధులే మిగలలేదని, ఆ నిధులకు సంబంధించిన ప్రతిపాదనలన్నీ ఎప్పుడో సంబంధిత జిల్లాల కలెక్టర్లకు పంపామని వివరించారు.

స్థానిక సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వచ్చే ప్రజల విజ్ఞప్తులను పరిష్కరించేందుకు అవసరమైన నిధుల కోసం సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్‌ను కూడా సేకరిస్తున్నామనే విషయాన్ని ఆ సంస్థ గుర్తుంచుకోవాలన్నారు. ఇకనైనా ఎంపీ ల్యాడ్స్ నిధులకు సంబంధించి నగదు కేటాయింపు, ఎంపీల ప్రతిపాదనలు, జిల్లా కలెక్టర్ల ఆమోదం, వివిధ శాఖల అధికారుల కార్యాచరణ, అమలు, పనుల పూర్తి వరకు దశలవారీగా వాస్తవాలను ఆ సంస్థ పరిగణనలోకి తీసుకుని, వాటిని ప్రజల ముందు ఉంచాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి

విద్యార్థులపై కేసులన్నింటినీ కొట్టివేసిన సుప్రీంకోర్టు

కాంగ్రెస్‌లో హైడ్రామా.. కొండా సురేఖ ఢిల్లీ పర్యటన వెనుక అసలు కారణమిదేనా..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy