ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
ఏపీ ఎస్ఈసీకి నోట్ పంపిన అధికారులు

అమరావతి : ఏపీ ఎన్నికల కమిషన్ వర్సెస్ జగన్ సర్కార్‌కు మధ్య గంట గంటకూ వివాదం పెరిగిపోతోంది. రేపు అనగా శనివారం నాడు తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో కార్యాలయానికి రావాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు వెళ్లినప్పటికీ వారు హాజరుకాలేదు. అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ రాకపోవడంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఈ క్రమంలో ఎస్ఈసీకి పంచాయతీ రాజ్ శాఖ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ నోట్ పంపారు.
నోట్‌లో ఏముంది..!?
సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని నిర్ణయం వెలువడే వరకు ఆగాలని నోట్‌లో అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకే సారి నిర్వహించటం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి కూడా ప్రభుత్వం తీసుకెళ్లిందని.. ఎన్నికలు తప్పనిసరి అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలపివేయాల్సి వస్తుందని కోర్టుకు ప్రభుత్వం చెప్పనున్నది. కనీసం ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ వేసేంత వరకు అయినా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ప్రభుత్వం కోర్టుకు విన్నవించనున్నది.
చర్యలు తప్పవు..!
ఇదిలా ఉంటే.. మరి కాసేపట్లో ఎస్ఈసీ వద్దకు సీఎస్, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్లనున్నారు. సీఎస్ క్యాంప్ కార్యాలయానికి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ప్రవీణ్ ప్రకాష్, సాల్మన్ అరొక్య రాజ్ చేరుకున్నారు. రేపు అనగా శనివారం నాడు పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మరోసారి నిమ్మగడ్డ తేల్చిచెప్పారు. సీఈసీకి ఉండే అధికారాలే ఎస్ఈసీకి ఉంటాయని.. అధికారులంతా ఎస్ఈసీ ఆదేశాలు పాటించాల్సిందేనని తెలిపారాయన. ఎన్నికల నియమావళిని ఎవరూ ఉల్లంఘించకూడదని.. నిబంధనలు అతిక్రమిస్తే ఏ హోదాలో ఉన్నా వారిపై చర్యలు తప్పవని ఒకింత హెచ్చరించారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటామని రమేష్ మీడియాకు వెల్లడించారు.