Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

అమరావతి, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 659 మండలాల్లో జెడ్పీటీసీ, 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈరోజు(సోమవారం) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ కలిపి మొత్తం10,488 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీకి రూ.4 లక్షలు, జెడ్పీటీసీకి రూ.8 లక్షల వరకు ఖర్చు చేయొచ్చన్నారు. జెడ్పీటీసీకి 28 మంది, ఎంపీటీసీలకు 687 ఆర్వోలుగా ఉన్నారని చెప్పారు.

అక్టోబర్‌ 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, నామినేషన్ల దాఖలు చేసేందుకు మూడు రోజులు అవకాశం ఇచ్చామని ఎస్‌ఈసీ అన్నారు. అక్టోబర్‌ 24న నామినేషన్‌ పత్రాల పరిశీలన ఉంటుందని, తిరస్కరించిన నామినేషన్లపై అక్టోబర్‌ 25న అప్పీళ్లకు అవకాశం ఉంటుందన్నారు. అక్టోబర్‌ 26న అప్పీళ్లను పరిష్కరించనున్నట్లు చెప్పారు. అక్టోబర్‌ 27న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా తెలిపారు. ఉపసంహరణల అనంతరం అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నట్లు చెప్పారు. నవంబర్‌ 3న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను నిర్వహిస్తామని, అవసరమైన చోట నవంబర్‌ 4న తిరిగి పోలింగ్‌ ఉంటుందన్నారు. నవంబర్‌ 5న ఓట్ల లెక్కింపు అనంతరం అదేరోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు అనిల్ చంద్ర పేర్కొన్నారు.

షెడ్యూల్ ఇదే..

  • అక్టోబర్ 21న ఎన్నికల నోటీసు జారీ, అలాగే ఓటర్ల జాబితా ప్రదర్శన

  • అక్టోబర్ 21: నామినేషన్ల స్వీకరణ ప్రారంభం (ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు)

  • అక్టోబర్ 23: నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ (సాయంత్రం 5:00 గంటల వరకు)

  • అక్టోబర్ 24: ఉదయం 8:00 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన

  • అక్టోబర్ 25: తిరస్కరించబడిన నామినేషన్లపై అప్పీలు చేయడానికి ఆఖరు తేదీ (సాయంత్రం 5:00 వరకు)

  • ఎంపీటీసీ అప్పీళ్లను ఆర్‌డీఓ (RDO), జెడ్పీటీసీ అప్పీళ్లను జిల్లా కలెక్టర్ పరిధిలో దాఖలు చేయాలి

  • అక్టోబర్ 26: అప్పిలేట్ అధికారిచే అప్పీళ్ల పరిష్కారం

  • అక్టోబర్ 27: అభ్యర్థిత్వాల ఉపసంహరణకు ఆఖరు తేదీ (మధ్యాహ్నం 3:00 గంటల వరకు)

  • అక్టోబర్ 27: మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ

  • నవంబర్ 3: పోలింగ్ తేదీ (ఉదయం 7:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు)

  • నవంబర్ 4: రీ-పోలింగ్ (ఏదైనా ఉంటే) (ఉదయం 7:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు)

  • నవంబర్ 5: ఓట్ల లెక్కింపు (ఉదయం 8:00 గంటల నుంచి)

  • ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాల ప్రకటన

మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. మైదుకూరు ఎన్నిక వాయిదా

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైనట్లు ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ స్థానాలకు 320 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. వార్డు సభ్యుల స్థానాలకు 8,190 నామినేషన్లు వచ్చాయని వెల్లడించారు. 87 మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులకు 1,358 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 24,451 నామినేషన్లు అందినట్లు పేర్కొన్నారు. మైదుకూరు అర్బన్ లోకల్ బాడీకి ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పునేఠా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy