Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏప్రిల్‌లో ప్లాస్టిక్‌ నోట్ల విడుదల!

ఏప్రిల్‌లో ప్లాస్టిక్‌ నోట్ల విడుదల!

తొలుత రూ.10, రూ.20 నోట్లు.. ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా

ముంబై: దీర్ఘకాలం మన్నే పాలిమర్‌ (ప్లాస్టిక్‌) కరెన్సీ నోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం (2027 ఏప్రిల్‌)లో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా బుధవారం తెలిపారు.

ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పైలెట్‌ ప్రాజెక్టుగా రూ.10, రూ.20 ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా మరిన్ని డినామినేషన్లలో ప్లాస్టిక్‌ కరెన్సీని ముద్రించాలా..? వద్దా..? అని నిర్ణయం తీసుకోనున్నట్లు గవర్నర్‌ చెప్పారు. ప్రస్తుతం చలామణి లో ఉన్న పేపర్‌ నోట్లను పూర్తిగా ప్లాస్టిక్‌ కరెన్సీతో భర్తీ చేసే ప్రతిపాదనేమీ లేదని మల్హోత్రా స్పష్టం చేశారు. కాగితం నోట్లతో పాటు ప్లాస్టిక్‌ నోట్లూ చెల్లుబాటవుతాయన్నారు. ఒక్కో డినామినేషన్‌లో 100 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల రూ.10, రూ.20 ప్లాస్టిక్‌ నోట్లను ముద్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి అనుమతిచ్చింది.

ప్లాస్టిక్‌ నోట్ల ముద్రణకు రెండు లక్ష్యాలు

  • ఇవి దీర్ఘకాలం మన్నుతాయి. ముఖ్యంగా చిన్న డినామినేషన్‌ కరెన్సీ నోట్లు అధికంగా చేతులు మారుతుంటాయి. కాబట్టి వాటి జీవిత కాలం కూడా తక్కువే. పలు దేశాల్లో ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లు 30 ఏళ్లకు పైగా చలామణిలో ఉన్నాయి. వాటి జీవిత కాలం చాలా ఎక్కువ. పేపర్‌ నోట్లతో పోలిస్తే రెండు నుంచి నాలుగు రెట్ల కాలం మన్నుతాయి.

  • ఆర్థిక వ్యవస్థ పరిమాణం గణనీయంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇవి మార్కెట్లోని నోట్ల సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి.

పదేళ్లలో రూ.50 లక్షల కోట్ల నోట్ల ఉపసంహరణ

గడిచిన దశాబ్ద కాలంలో దాదాపు రూ.50 లక్షల కోట్ల విలువైన చిరిగిన, పాడైన కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ప్లాస్టిక్‌ నోట్ల ప్రవేశంతో ఇది తగ్గనుంది. ఎందుకంటే, 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్‌బీఐ జారీ చేసిన ప్రతి 100 కొత్త నోట్లకు గాను మార్కెట్‌ నుంచి 71 పాడైన నోట్లను వెనక్కి తీసుకుంది. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త నోట్లను విడుదల చేసేందుకు ఆర్‌బీఐ ఏటా కరెన్సీ భద్రత ఫీచర్ల కోసం ఏటా రూ.5,000 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy