Dailyhunt
ఎరువుల కొరత లేదు, ఆందోళన వద్దు: లోక్‌సభలో జేపీ నడ్డా

ఎరువుల కొరత లేదు, ఆందోళన వద్దు: లోక్‌సభలో జేపీ నడ్డా

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఘర్షణలు కారణంగా ఎరువులు, ముడి పదార్ధాల రవాణాలో ఆలస్యం చోటుచేసుకుని రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) లోక్‌సభలో స్పందించారు.

ఎరువులపై యుద్ధ ప్రభావం పడకుండా రైతుల అవసరాలకు సరిపడా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. ఔషధాల తయారీకి ఇతర దేశాల నుంచి ముడిసరుకు దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కూడా చర్యలు చేపట్టామని చెప్పారు.

ముడిసరుకుల దిగుమతి విషయంపై ఒక్క దేశం పైనే ఆధారపడకుండా ప్రత్నామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని, ఇప్పటికే పలు దేశాలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నామని నడ్డా వివరించారు. ఔషధాల తయారీకి ఇతర దేశాల నుంచి ముడిసరుకు దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కూడా చర్యలు చేపట్టామని చెప్పారు.

దీనికిముందు, పశ్చిమాసియాలో పరిస్థితిపై సమీక్షించేందుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది. ఇందులో ప్రధానంగా ఎరువుల లభ్యత, సరఫరాపై చర్చించారు. ఖరీఫ్ సీజన్ వరకూ ఎలాంటి కొరత లేదని, రైతుల అవసరాలకు సరిపడా సరఫరా చేయగలమని సమావేశం ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే పశ్చిమాసియాలో సంక్షోభం ఇలాగే కొనసాగితే ఎరువుల ఉత్పత్తి 0.6 నుంచి 0.9 మిలియన్ టన్నుల మేరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆరోగ్య, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy