Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎట్టకేలకు..

ఎట్టకేలకు..

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ప్రకటించిన సంక్షేమ పథకాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ప్రతిష్టాత్మకమైనవి. ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఇళ్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కలలు నిజం చేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.

గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడా కొన్ని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పేదలకు దక్కినా పట్టణ ప్రాంతాల్లో మాత్రం అవి వారికి కలగానే మిగిలిపోయాయి. జిల్లాలో బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మాణం ప్రారంభించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పినట్లుగా కొనసాగుతూ వచ్చాయి. పదేళ్లు గడిచాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయి కాంగ్రెస్‌ పాలన ప్రారంభమైంది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టి ప్రస్తుత ప్రభుత్వం పేదలకు ఇల్లు సమకూరుస్తున్నది. చాలా రోజులుగా జిల్లాలో నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు వృథాగా పడి ఉంటున్నాయి.

పంపిణీకి సిద్ధంగా ఇళ్లు

ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రజలకు అందించాలని నిర్ణయించింది. జిల్లాలో త్వరలో 1,660 ఇళ్లు పేదలకు దక్కనున్నాయి. కరీంనగర్‌లో 660, హుజూరాబాద్‌లో 500, జమ్మికుంట మున్సిపాలిటీలో 500 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జగిత్యాల జిల్లాలో పర్యటించిన సమయంలోనే కరీంనగర్‌ పర్యటన కూడా ఉంటుందని ఆ పర్యటనలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణి చేస్తారని భావించి జిల్లా యంత్రాంగం అందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆయన జిల్లాకు రాక పోవడంతో ఇళ్ల పంపిణీ జరగలేదు.

మంత్రి పర్యటనలో..

సెప్టెంబర్‌ మొదటి వారంలో మంత్రి జిల్లా పర్యటనకు వస్తారని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణి చేస్తారని భావిస్తూ అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 27,290 మందికి ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు లేవని గుర్తించారు.హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో 2,012 మంది, జమ్మికుంట మున్సిపాలిటీలో 2,421 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొంత మందికి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్లు మంజూరు కాగా మిగిలిన వారిలో కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో 660, హుజూరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 500, జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలో 500 మందిని మంత్రి సమక్షంలో ఎంపిక చేసి వారికి డబుల్‌ బెడ్‌రూంల ఇళ్లను అందజేస్తారని తెలిసింది.

నిర్మాణం పూర్తయిన 2,707 ఇందిరమ్మ ఇళ్లు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ 2,04,625 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 49,003 మందికి పక్కా ఇళ్లు గాని, ఇంటి స్థలం గాని లేదని గుర్తించారు. 77,105 మంది పక్కా ఇళ్లు లేకుండా స్థలం కలిగి ఉన్నారని గుర్తించారు. 78,517 మందికి పక్కా ఇళ్లు ఉన్నందున వారిని అనర్హులుగా తేల్చారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాల్లో 11,255 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు మంజూరు ఇచ్చారు. వీటిలో ఇప్పటి వరకు 8,736 ఇళ్ల నిర్మాణ పనులకు మాత్రమే మార్కవుట్‌ ఇచ్చారు. వీటిలో 7,656 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా 1,011 ఇళ్ల పనులు పునాదుల స్థాయికే పరిమితయ్యాయి. 584 ఇళ్ల పనులు రూఫ్‌ లెవల్‌కు, 3,354 ఇళ్ల పనులు స్లాబ్‌ దశకు చేరుకున్నాయి. 2,707 ఇళ్ల పనులు పూర్తయ్యాయి. పూర్తయిన ఇళ్లలోకి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తున్నారు. త్వరలో ప్రతి నియోజక వర్గానికి 3500 చొప్పున ఇళ్ల మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy