Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫైనల్లో యువ భారత్‌

ఫైనల్లో యువ భారత్‌

101 పరుగులతో అఫ్ఘాన్‌పై విజయం ముక్కోణపు సిరీస్‌

దంబుల్లా: ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన యువ భారత్‌.. ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌-ఎ 101 పరుగులతో అఫ్ఘానిస్థాన్‌-ఎను చిత్తు చేసింది.

తొలుత భారత్‌-ఎ నిర్ణీత 50 ఓవర్లలో 319/9 స్కోరు చేసింది. తిలక్‌ వర్మ (59), ప్రియాన్ష్‌ ఆర్య (58), కుమార్‌ కుశాగ్ర (58) అర్ధ శతకాలతో రాణించారు. ఫర్మానుల్లా సఫీ, అబ్దులా అహ్మద్‌జాయ్‌, ఫరీదున్‌ దావూద్‌జాయ్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. యువ భారత్‌ ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోవాలంటే 320 పరుగుల ఛేదనలో.. అఫ్ఘాన్‌ను 236, అంతకంటే తక్కువ పరుగులకే కట్టడి చేయాలి. అయితే, స్పిన్నర్‌ నిషాంత్‌ సింధు (4/31) తిప్పేయడంతో.. అఫ్ఘాన్‌ 36.5 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. బహీర్‌ షా (57), ఫైజర్‌ షినోజదా (46) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. యశ్‌ ఠాకూర్‌ 2 వికెట్లు తీశాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో డీలా పడినా.. ఈ గెలుపుతో మొత్తం 4 పాయింట్లు సాధించిన భారత్‌-ఎ మెరుగైన రన్‌రేట్‌తో ఫైనల్‌కు అర్హత సాధించింది. శుక్రవారం శ్రీలంక, అఫ్ఘాన్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో భారత్‌ ప్రత్యర్థి ఎవరో తేలుతుంది. 4 పాయింట్లతోపాటు 0.49 రన్‌రేట్‌తో శ్రీలంక రెండో స్థానంలో ఉంది. ఒకవేళ లంకను దాటాలంటే అప్ఘాన్‌ భారీ విజయం సాధించాలి. నిషాంత్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు.

స్పిన్‌ ఉచ్చులో చిక్కి..: ఛేదనలో నిషాంత్‌ స్పిన్‌ ఉచ్చులో చిక్కి అఫ్ఘాన్‌ విలవిల్లాడింది. ఓపెనర్‌ హసన్‌ (14)ను యశ్‌ అవుట్‌ చేసి తొలి బ్రేక్‌ అందించాడు. 6వ ఓవర్‌లో ఖలీద్‌ (13)ను కాంబోజ్‌.. 10వ ఓవర్‌లో కెప్టెన్‌ ఇమ్రాన్‌ (32)ను నిషాంత్‌ అవుట్‌ చేశారు. అయితే ఫైజల్‌, బహీర్‌ నాలుగో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఫైజల్‌ను కాంబోజ్‌.. ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న బహిర్‌ను విప్రజ్‌ వెనక్కి పంపడంతో అప్ఘాన్‌ పతనం వేగంగా జరిగిపోయింది.

అదరగొట్టిన బ్యాటర్లు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌-ఎకు ఓపెనర్లు ప్రియాన్ష్‌, వైభవ్‌ సూర్యవంశీ (38) దూకుడైన ఆరంభాన్నే ఇచ్చారు. అయితే, 8వ ఓవర్‌లో వైభవ్‌ను దావూద్‌జాయ్‌ అవుట్‌ చేయడంతో.. తొలి వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అర్ధ శతకం పూర్తి చేసుకొన్న ప్రియాన్ష్‌ను సఫీ.. గైక్వాడ్‌ (30)ను అబ్దుల్లా వెనక్కిపంపారు. ఈ దశలో తిలక్‌, కుశాగ్ర నాలుగో వికెట్‌కు 104 రన్స్‌ జోడించి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. కుశాగ్రను దావూద్‌జాయ్‌ పెవిలియన్‌ చేర్చగా.. హాఫ్‌ సెంచరీ అనంతరం తిలక్‌ను అబ్దుల్లా అవుట్‌ చేశాడు. సూర్యాంశ్‌ షెగ్డే (7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. విప్రజ్‌ నిగమ్‌ (30), నిషాంత్‌ సింధు (21 నాటౌట్‌) ధాటిగా ఆడుతూ జట్టు స్కోరును 300 మార్క్‌ దాటించారు.

సంక్షిప్త స్కోర్లు

భారత్‌ 'ఎ': 50 ఓవర్లలో 319/9 (తిలక్‌ 59, ప్రియాన్ష్‌ 58, కుశాగ్ర 58; అబ్దుల్లా 2/62, ఫర్మానుల్లా 2/62).

అఫ్ఘానిస్థాన్‌ 'ఎ': 36.5 ఓవర్లలో 218 ఆలౌట్‌ (బహీర్‌ షా 57, ఫైజల్‌ 46; నిషాంత్‌ 4/31, యశ్‌ 2/48).

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy