Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిఫా ప్రపంచ కప్‌ చరిత్రలో అరుదైన ఘటన...

ఫిఫా ప్రపంచ కప్‌ చరిత్రలో అరుదైన ఘటన...

స్పోర్ట్స్ డెస్క్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సరికొత్త నిబంధన అమలులోకి వచ్చింది. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో మాట్లాడేటప్పుడు నోటికి చేయి అడ్డుపెట్టుకుంటే ఇకపై రెడ్ కార్డ్ ఎదుర్కోవాల్సిందే.

ఈ నేపథ్యంలో ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో నోటికి చేయి అడ్డుపెట్టుకున్నందుకు తొలిసారి ఓ ఆటగాడు రెడ్ కార్డును ఎదుర్కొన్నాడు. శనివారం గ్రూప్-డిలో భాగంగా టర్కీతో జరిగిన మ్యాచ్‌లో పరాగ్వే స్టార్ వింగర్ మిగ్యుల్ అల్మిరాన్ (32) ఈ కొత్త నిబంధనకు బలైన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

మ్యాచ్ తొలి అర్ధభాగంలో పరాగ్వే 1-0 ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. టర్కీ ఆటగాడు మెర్ట్ ముల్దుర్‌తో మాట్లాడుతున్నప్పుడు అల్మిరాన్ తన చేతిని నోటికి అడ్డుపెట్టుకున్నాడు. దీనిని గమనించిన ముల్దుర్ వెంటనే పక్కనే ఉన్న రిఫరీకు ఫిర్యాదు చేశాడు. వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) పరిశీలన అనంతరం ప్రధాన రెఫరీ ఐవన్ బార్టన్.. అల్మిరాన్‌కు రెడ్ కార్డ్ చూపించి మైదానం బయటకు పంపించాడు.

మైదానంలో ఆటగాళ్లు నోరు దాచుకుని జాతివివక్ష లేదా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని అరికట్టేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు 2026 ఏప్రిల్‌లో ఈ కఠిన నిబంధనను తెచ్చింది. ఆటగాళ్లు నోరు దాచుకున్నారంటేనే 'చెప్పకూడనిది ఏదో చెప్పారు' అనే అనుమానంతో రెఫరీలు నిర్ణయం తీసుకోవచ్చని ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో గతంలోనే స్పష్టం చేశారు. కాగా, గత మ్యాచ్‌లో డైవింగ్ (అబద్ధపు ఫౌల్ యాక్టింగ్) చేసినందుకు ఎల్లో కార్డ్ పొందిన అల్మిరాన్, ఇప్పుడు సరికొత్త నిబంధనతో ఏకంగా రెడ్ కార్డ్ తెచ్చుకోవడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy