Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిఫా ప్రపంచ కప్: లాకర్ రూమ్‌లో ఇరాన్ జట్టు నోట్!

ఫిఫా ప్రపంచ కప్: లాకర్ రూమ్‌లో ఇరాన్ జట్టు నోట్!

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో ఇరాన్ జట్టు ప్లేయర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ సహ ఆతిధ్య దేశం అమెరికా.. కొందరు ఇరాన్ ప్లేయర్ల వీసా అనుమతి నిరాకరించింది.

దీనివల్ల మ్యాచ్ ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకునే అవకాశమే లేకుండా దేశాన్ని వదిలి వెళ్లాల్సి వస్తోంది. న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ 2-2తో డ్రా అవ్వగా.. తాజాగా బెల్జియం జట్టుతో ఇరాన్ మ్యాచ్ 0-0తో డ్రా అయింది. లాస్ ఏంజెలెస్‌లోని సోఫీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అనంతరం ఇరాన్ ప్లేయర్లు భావోద్వేగంతో ఓ లేఖ రాసి లాకర్ రూమ్‌లో వదిలి వెళ్లారు.

'ప్రాచీన పర్షియా నుంచి ఇప్పటి ఇరాన్ వరకు మా దేశ ప్రజల వ్యక్తిత్వం స్థిరంగానే ఉంది. ఈ టోర్నీలో లాస్ ఏంజెలెస్‌కు వచ్చి గౌరవంగా పోటీ పడ్డాం. సగర్వంగా ఇక్కడి నుంచి వెళ్తున్నాం. మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. ఈ మ్యాచ్ జరిగిన 180 నిమిషాల పాటు మాకు మద్దతుగా నిలిచిన ఇరాన్ అభిమానులకు కృతజ్ఞతలు. అన్ని దేశాల మధ్య శాంతి, స్నేహం ఉండాలి' అని ఇరాన్ ప్లేయర్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే #168, #minab అనే హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ఈ లేఖలో ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌లో జరిగిన సంఘటనలను సూచించే ఈ హ్యాష్‌ట్యాగ్‌లు రాజకీయ భావోద్వేగాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి.

టోర్నమెంట్ సమయంలో ఇరాన్ జట్టు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. వీసా పరిమితులు, ప్రయాణ ఆంక్షల కారణంగా జట్టు మెక్సికోలోని టిజువానా నుంచి ప్రతి మ్యాచ్‌కు అమెరికాకు ప్రయాణించాల్సి వస్తోంది. కొందరు సిబ్బందికి వీసాలు రాకపోవడం, ఆటగాళ్లకు ప్రయాణ ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఈ పరిస్థితులపై ఇరాన్ కోచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ టోర్నమెంట్‌లోనే అత్యంత ఒత్తిడికి గురైన జట్టు ఇరాన్ అని తెలిపాడు. గ్రూప్ దశలో ఇరాన్ రెండు మ్యాచ్‌ల్లో 2 పాయింట్లు సాధించి నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. చివరి మ్యాచ్‌లో ఈజిప్ట్ జట్టుతో తలపడనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy