Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిఫా ప్రపంచ కప్: రౌండ్ 16కు దూసుకెళ్లిన కెనడా

ఫిఫా ప్రపంచ కప్: రౌండ్ 16కు దూసుకెళ్లిన కెనడా

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో సహ ఆతిథ్య దేశం కెనడా రౌండ్ 16కు దూసుకెళ్లింది. లాస్‌ఏంజెలెస్‌లో ఉత్కంఠభరితంగా సాగిన నాకౌట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 1-0 తేడాతో నెగ్గింది.

మ్యాచ్ ముగుస్తుందనగా ఇంజూరీ సమయంలో కెనడా మిడ్‌ఫీల్డర్ స్టీఫెన్ అద్భుతమే చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని చక్కగా ఒడిసిపట్టుకుని గోల్‌గా మార్చాడు. దీంతో ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే కెనడా తొలిసారిగా నాకౌట్ మ్యాచ్ నెగ్గి రౌండ్ 16కు అర్హత సాధించింది. గతంలో ఈ జట్టు గ్రూప్ దశను కూడా దాటలేకపోవడం గమనార్హం.

రెండు అర్ధభాగాల్లో ఇరుజట్ల ఆటగాళ్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించారు. గోల్‌పోస్ట్ లక్ష్యంగా దక్షిణాఫ్రికా 2 షాట్స్, కెనడా ఆటగాళ్లు 7 సార్లు బంతిని కొట్టారు. 58 శాతం సమయం బంతిని తన నియంత్రణలోనే ఉంచుకున్నప్పటిక సౌతాఫ్రికా ప్లేయర్లు గోల్ చేయడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు కెనడా ఆటగాళ్లకు రిఫరీ యెల్లో కార్డ్స్ ఇచ్చారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరు డ్రాగా ముగుస్తుందని అనుకునేలోపు.. కెనడా మిడ్‌ఫీల్డర్ గోల్ కొట్టి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా ప్రయత్నించినప్పటికీ గోల్ చేయలేకపోయింది. దీంతో నాకౌట్ మ్యాచ్‌లో కెనడా ఘన విజయం సాధించింది.

ఫిఫా ప్రపంచ కప్ సహ ఆతిథ్య దేశంగా ఉన్న కెనడా లీగ్ దశలో గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. గ్రూప్-బిలో స్విట్జర్లాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమిపాలైంది. అయితే నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం చక్కటి డిఫెన్స్‌తో ప్రత్యర్థిని గోల్ కొట్టకుండా నిలువరించింది. కాగా నెదర్లాండ్స్, మొరాకో మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుతో జులై 4న రౌండ్ 16లో కెనడా తలపడనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy