ఢిల్లీ, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): దానం నాగేందర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు (గురువారం) విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
దానం నాగేందర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో దానం పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణకు న్యాయస్థానం నిరాకరించింది. ఆయనపై అనర్హత వేటు పడిందని.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వ్యక్తిగతంగా పార్టీలో చేరితే తప్పు కాదని.. పదవితో పాటు ఫిరాయింపు తప్పేనని ధర్మాసనం తేల్చిచెప్పింది.
హైకోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి జోక్యం చేసుకోమని నిరాకరిస్తూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకపోయినా లేదా అధికారికంగా రాజీనామా పత్రం ఇవ్వకపోయినా, వేరే రాజకీయ పార్టీ టికెట్‌పై నామినేషన్ వేసి పోటీ చేయడం రాజ్యాంగబద్ధంగా పార్టీని వీడినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని... సుస్పష్టమైన ఆధారాలు (మరో పార్టీ బీ-ఫారమ్‌పై పోటీ చేయడం) ఉన్నప్పుడు స్పీకర్ చర్య తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.
సుప్రీంలో 'ఘర్ వాపసీ' వాదనలను దానం తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వినిపించారు. దానం తిరిగి సొంత పార్టీకి వచ్చి(ఘర్ వాపసీ), పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని.. ఆయనపై పార్టీ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదని అన్నారు. ఆయనపై అనర్హత వేటు పడకూడదని తెలిపారు. పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడం వేరని, చట్టసభ (Legislature) సభ్యత్వాన్ని నిలబెట్టుకోవడం వేరని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తిరిగి పార్టీలోకి వచ్చినంత మాత్రాన చట్టసభ సభ్యత్వంపై పడే అనర్హత వేటు తొలగిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది.
కాగా, తెలంగాణ హై కోర్టు వేసిన అనర్హత తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకువెళ్లిన విషయం తెలిసిందే. గత శుక్రవారం దానంపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పును కొట్టి వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దానం నాగేందర్ దాఖలు చేశారు. ఆయన కేసును గత బుధవారం విచారిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించింది. అయితే, బుధవారం కేసు లిస్ట్ కాకపోవడంతో ఈ పిటిషన్‌ను ఈరోజుకు వాయిదా వేసింది. దానంపై అనర్హత వేయాలని హైకోర్టులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..

