Dailyhunt
ఫ్లిప్‌కార్ట్ చేతికి క్లియర్‌ట్రిప్.. ఉద్యోగులు సేఫ్

ఫ్లిప్‌కార్ట్ చేతికి క్లియర్‌ట్రిప్.. ఉద్యోగులు సేఫ్

బెంగళూరు: ఆన్‌లైన్ ట్రావెల్ టెక్నాలజీ కంపెనీ క్లియర్‌ట్రిప్‌ను ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సొంతం చేసుకుంది. ఆ సంస్థలోని 100 శాతం వాటాను చేజిక్కించుకోబోతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ నేడు ప్రకటించింది. అందులో మరిన్ని పెట్టుబడులు పెట్టి బలోపేతం చేయనున్నట్టు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ సొంతంకాబోతున్న క్లియర్‌ట్రిప్ ప్రత్యేక బ్రాండ్‌గానే కొనసాగనుంది.

ఫ్లిప్‌కార్ట్ సొంతం చేసుకున్నప్పటికీ ఆ సంస్థ ఉద్యోగులకు వచ్చిన నష్టమేమీ లేదని, ఉద్యోగులందరూ తమతోనే ఉంటారని పేర్కొంది. క్లియర్‌ట్రిప్‌లో తాము పెట్టే పెట్టుబడులు సంస్థను మరింత బలోపేతం చేస్తాయని, వినియోగదారులకు విస్తృత ప్రయోజనాలు అందించేందుకు తోడ్పడతాయని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.

పరిశ్రమ పరిజ్ఞానం, సాంకేతిక శక్తిసామర్థ్యాలు ఉన్న క్లియర్‌ట్రిప్ టీమ్‌ను తాము సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ కుటుంబంలో తాము భాగస్వామవుతున్నందుకు ఆనందంగా ఉందని క్లియర్‌ట్రిప్ కో ఫౌండర్, సీఈవో స్టువార్ట్ క్రిగ్టన్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy