Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్యూచర్ సిటీ డిజైన్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సూచనలివే..

ఫ్యూచర్ సిటీ డిజైన్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సూచనలివే..

హైదరాబాద్, మే 20: పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్‌సీహెచ్‌ఆర్‌డీ(MCHRD)లో సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్, పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు.

నెట్ జీరో సిటీ తరహాలోనే ఫ్యూచర్ సిటీ డిజైన్స్ ఉండాలని సీఎం తెలిపారు. మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని.. ఇందులో రాజీపడొద్దని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని.. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు చేయాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని సీఎం అన్నారు.

ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్ట్‌లకు 500 ఎకరాలు కేటాయించాలని సీఎం తెలిపారు. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్‌ను ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రధాని మోదీని కలిసి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేద్దామని ముఖ్యమంత్రి అన్నారు. జూన్‌లో ఫ్యూచర్ సిటీ ఇండ్రస్టియల్ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగేలా చూడాలన్నారు. భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమలు నిర్మాణం మొదలు పెట్టేలా నిబంధన విధించాలని తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ఆకర్షణీయమైన లోగో, వెబ్‌సైట్ రూపొందించాలని వెల్లడించారు. ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థను రూపొందించాలని సీఎం ఆదేశించారు. గ్రూప్ 1 స్థాయి అధికారిని ఎస్కార్ట్ ఆఫీసర్‌గా నియమించే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక విధానాన్ని అధ్యయనం చేయాలన్నారు. బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించాలని ఆదేశించారు. 1500 ఎకరాల్లో డేటాసిటీ ఏర్పాటు చేయాలని.. డేటా సిటీ నీటి అవసరాల కోసం ఎస్‌టీపీలను వినియోగించాలని సూచనలు చేశారు. జీసీసీలు, డేటా సెంటర్లు కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్ల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించాలని ఆదేశించారు.

ద్వితీయ శ్రేణి నగరాలల్లో జీసీసీ(Global Capability Centers) ఏర్పాటు పైనా దృష్టి పెట్టేలా పాలసీ రూపకల్పన చేయాలన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు.. టీ ఫైబర్‌కు కనెక్ట్ కావాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(TGIIC) వైస్ చైర్మన్ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy