రోగుల ఇబ్బందులు
బయట కొనండి.. సిబ్బంది ఉచిత సలహా
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ధర్మాస్పత్రిగా పేరున్న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రోజు రోజుకు మందుల కొరత ఏర్పడుతుంది.
దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేద మధ్య తరగతి వారు వైద్యం కోసం గాంధీకి వస్తే మందులు బయట కొనడమేమిటని ప్రశ్నిస్తున్నారు. డబ్బులు ఉంటే గాంధీకి ఎందుకు వస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓపీలో ప్రతి రోజు రెండువేల మంది రోగులు వైద్యం చేయించుకుంటున్నారు. నగరంతో పాటు చుట్టుపక్కన గ్రామాల వాళ్లు వైద్యం నిమిత్తం గాంధీకి వస్తుంటారు. తీరా వైద్యులు మందులు రాస్తే ఫార్మసీలో మందులు లేకపోవడంతో బయట మెడికల్ షాపులో కొనాలంటూ ఫార్మసీ సిబ్బంది సూచిస్తున్నారు. వైద్యులు రాసిచ్చిన ఆరురకాల మందుల్లో కేవలం ఒకటి రెండు మాత్రమే ఫార్మసీలో అందుబాటులో ఉంటున్నాయి. మిగతా మందులు బయట కొనాలంటే చేతిలో డబ్బులు ఉండాలి కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీపీ, షుగర్ మందులు లేకపోతే ఎలా?
చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అనారోగ్యంతో ఉంటే ఎస్కార్టుతో గాంధీ ఓపీలో వైద్యుడికి చూపించడం జరుగుతుంది. తీరా వైద్యులు రాసిచ్చిన షుగర్, బీపీ మందులు లేవని ఫార్మసీలో చావు కబురు చల్లగా చెబుతున్నారు. ఈ క్రమంలో గాంధీలో వైద్యులు రాసిచ్చిన మందులు ఫార్మసీలో కొరత ఉంటే చర్లపల్లి జైలులో ఉన్న ఫార్మసీలో ఇస్తారని కొందరు ఖైదీలు చెబుతున్నారు. సాధారణ మందులు బీపీ షుగర్ మందులు గాంధీలో లేకపోవడం విచారకరమని రోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సూపరింటెండెంట్‌ను నియమించరా
గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ వాణి డీఎఈం పోస్టుకు బదిలీపై వెళ్లి 14 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సూపరింటెండెంట్‌ను నియమించలేదు. దీంతో గాంధీలో ఫైళ్లపై సంతకాలు పెట్టవారు కరువయ్యారు. సంతకాలు చేయకపోవడంతో మందులు ఇండెంట్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది.
కొరత ఉన్న మందులు ఇవే
గాంధీ ఓపీలో వైద్యులు రాసిచ్చిన మందుల కొరత ఏడాది నుంచి ఉన్నట్లు తెలిసింది. టెనోవిట్ క్రీం, పారఫిన్ లిక్విడ్, మెట్‌ఫోర్‌మిన్ 500ఎంజి, గ్లిమెప్రైడ్ 1ఎంజి, డాపాగ్లిఫ్లోజిన్ 10ఎంజి, సిటాగ్లాప్టిన్ 40ఎంజి, టెలినిస్సార్టిన్ 40 ఎంజి, అక్రోవాస్ 75ఎంజి, క్లోపిటాబ్ 140ఎంజి, ప్రేగాబాలిన్ 75ఎంజి, ప్యారసిటమోల్, బీపీ షుగర్ లాంటి మందులు మరో నలబై రకాల మందులు గాంధీ ఫార్మసిలో కొరత ఉంది.
డబ్బులు ఉంటే గాంధీకి ఎందుకు?
వైద్యులు వైద్యం చేయడం సరే.. వైద్యులు రాసిచ్చిన మందులు బయట కొనాలంటే చేతిలో డబ్బులు ఉండాలి కదా. డబ్బులు లేవనే కదా గాంధీకి వస్తున్నాం. ఆరు రకాల మందులు రాస్తే ఒకటి మాత్రమే ఫార్మసీలో ఇస్తున్నారు. బయట కొనాలంటే ఈ మందులకు దాదాపు ఆరు వందలు రూపాయలు అవుతుంది. చేతిలో డబ్బులు ఉంటే గాంధీకి ఎందుకు? రావాలి ఇంటి దగ్గర ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుల దగ్గరికి వెళితే సరిపోతుంది.
చంద్రకళ, రాంనగర్

