Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గల్ఫ్ నాట కష్టాలు.. దశాబ్దం తరువాత రిక్తహస్తాలతో స్వదేశానికి తెలుగు మహిళ

గల్ఫ్ నాట కష్టాలు.. దశాబ్దం తరువాత రిక్తహస్తాలతో స్వదేశానికి తెలుగు మహిళ

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: జీవిత భాగస్వామిని కోల్పోవడం లేదా విడాకుల కారణంగా ఒంటరిగా మారి, కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకునే పేద మహిళలకు అరబ్బు దేశాలు ఒక ఆశాకిరణంగా మారాయి.

పేద తెలుగు మహిళలు తమ జీవితంలో ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన కోసం ఎడారిబాట పడుతున్నారు. వీరిలో కొందరు ఒంటరి తల్లులు సవాలక్ష సమస్యలతో సతమతమవుతూ చివరకు స్వదేశానికి తిరుగు పయనమవుతున్నారు.

తన కన్న పేగు కోసం, తనను కన్న తల్లిని నమ్ముకుని ఆమె వద్ద పిల్లలను వదిలి కొద్ది సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లిన ఒక తెలుగు మహిళ ఇటీవల స్వదేశానికి తిరిగివచ్చారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలానికి చెందిన తురుమణి వీర వెంకమ్మ అనే 52 ఏళ్ళ మహిళ కొన్ని సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని అల్ ఖర్జ్ పట్టణానికి ఉద్యోగం కోసం వెళ్లారు. భర్త చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లను స్వగ్రామంలో తన తల్లి సంరక్షణలో పెట్టారు. ప్రస్తుతం పిల్లలు పెద్దవారయ్యారు. ఒక కూతురు ప్రస్తుతం కువైత్‌కు వెళ్లగా మరో కూతురు గ్రామంలో తన అమ్మమ్మ వద్ద ఉంటోంది. తాను ఉంటున్న చోట పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెంకమ్మ యాజమాని వద్ద నుంచి పారిపోయి స్థానిక నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తూ కాలం గడిపారు.

ఇటీవల ఆమె తల్లి మరణించారు. ఆమె కూతురి బాగోగులు చూసే వారెవరూ లేకపోవడంతో స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు వెంకమ్మ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె పాస్‌పోర్టు, వీసా గడువు ముగియడంతో తిరుగు పయనం కష్టమైంది. దశాబ్ద కాలంగా స్వదేశానికి వెళ్లకుండా అక్కడే ఉన్నా చివరకు విమాన టికెట్ కోసం వెంకమ్మ విలవిల్లాడిపోయిన విషయాన్ని మలయాళీ సామాజిక సేవకుల ద్వారా తెలుసుకున్న సాటా(యం) వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేశన్ ఆమెకు అండగా నిలిచి ఒక దాత ద్వారా విమాన టికెట్‌ను అందించారు.

సౌదీ అరేబియాలో తరుచుగా ప్రవాసాంధ్ర మహిళలు చట్టాలను గౌరవించకుండా కుటుంబ బాధ్యతలు, అప్పుల కారణంగా అక్రమార్గన పని చేస్తూ ఈ రకమైన దుర్భర పరిస్థితులలో స్వదేశానికి తిరిగి వెళ్లడం ఆవేదన కలిగిస్తుందని మల్లేశన్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy