తెలంగాణ తాజావార్తలు
గంగపుత్రులను కించపర్చే ఉద్దేశం లేదు
ముదిరాజ్‌లలో ఉత్తేజానికే అలా మాట్లాడా: మంత్రి తలసాని
జగిత్యాల, జనవరి 21(ఆంధ్రజ్యోతి): గంగపుత్రుల మనోభావాలను కించపర్చే ఉద్దేశం తనకు లేదని, కేవలం ముదిరాజ్‌లను ఉత్తేజపర్చడానికే కోకాపేటలో అలా మాట్లాడానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరణ ఇచ్చారు. గురువారం జగిత్యాలలో జరిగిన యాదవులకు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గంగపుత్రుల జీవితం పూర్తిగా నీటిపై ఆధారపడి ఉందని, చెరువులు, కుంటలపై గంగపుత్రుల సొసైటీలకు సంపూర్ణ హక్కులుంటాయని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి గంగపుత్రుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గంగపుత్రులు, యాదవుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. యాదాద్రి, బాసర, భద్రాచలం, వేములవాడ, ధర్మపురి, కొమురవెల్లి తదితర దేవస్థానాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. కొమురవెల్లి మల్లన్న, బీరన్న దేవుళ్ల ప్రతిరూపమే సీఎం కేసీఆర్ అన్నారు. కాగా, మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు ముందు జాగ్రత్తగా జిల్లా వ్యాప్తంగా పలువురు గంగపుత్రులను అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు.