Dailyhunt
గర్భధారణపై మైక్రోగ్రావిటీ ప్రభావం.. శాస్త్రవేత్తలు ఏం తేల్చారంటే..

గర్భధారణపై మైక్రోగ్రావిటీ ప్రభావం.. శాస్త్రవేత్తలు ఏం తేల్చారంటే..

ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్ష యాత్రలపై మానవాళి కొంత పట్టు సాధించింది. అంతరిక్షంలో వ్యోమగాములు సుదీర్ఘకాలం పాటు గడిపి భూమికి తిరిగి చేరుకుంటున్నారు.

ఇతర గ్రహాలపై మానవాళి ఆవాసాలు ఏర్పాటు చేసుకునే దిశగా కూడా శాస్త్రవేత్తలు ఆలోచనలు చేస్తున్నారు. అయితే, ఇతర గ్రహాల్లో మనుగడ సాధ్యపడాలంటే కేవలం సాంకేతికత సరిపోదు. అక్కడి పరిస్థితులకు మానవ శరీరం అలవాటు పడటంతో పాటు సంతానోత్పత్తి కూడా సాధ్యపడాలి. ఈ నేపథ్యంలో భూమికి ఆవల మానవుల పునరుత్పాదక సామర్థ్యం ఎంతవరకు ఉండొచ్చన్న అంశంపై తాజాగా జరిగిన ఒక అధ్యయనం కమ్యూనికేషన్స్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.

ప్రయోగం ఇలా..

అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు తాము భారరహితంగా ఉన్నట్టు అనుభూతిని పొందుతారు. దీనిని శాస్త్రపరిభాషలో మైక్రోగ్రావిటీ అని పిలుస్తారు. భూమి చుట్టూ అంతరిక్ష కేంద్రం వేగంగా తిరుగుతూ ఉంటుంది. దీంతో, స్పేస్ స్టేషన్‌లోని వ్యోమగాములు నిరంతరం 'ఫ్రీ ఫాల్' స్థితిలో ఉంటారు. అందువల్ల వారికి భారం లేకపోయినట్టుగా అనిపిస్తుంది.

ఇలాంటి మైక్రోగ్రావిటీ పరిస్థితులు మానవ పునరుత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగంలో మానవ శుక్రకణాలను మైక్రోగ్రావిటీ పరిస్థితులు ఉన్న ప్రత్యేక ఛేంబర్‌లో పెట్టి వాటి గమనాన్ని పరిశీలించారు. ఈ పరిస్థితుల్లో శుక్రకణాలు సాధారణంగా ఈదగలిగినా, అవి తమ దిశను గుర్తించడంలో సమస్యలు ఎదుర్కొన్నట్టు గుర్తించారు. అవి ఒకే దిశలో కదలకుండా తడబడుతున్నట్టు అనిపించిందని చెప్పారు. ఇది ఫలదీకరణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. కొన్ని సార్లు ఫర్టిలైజేషన్ రేటు సుమారు 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అన్నారు.

అండం విడుదల చేసే ప్రొజెస్టిరాన్ హోర్మోన్‌ను అనుసరించి శుక్రకణాలు తమ దిశను మార్చుకుంటాయి. మైక్రోగ్రావిటీ ప్రయోగంలో కూడా శుక్రకణాలు ఇదే తీరులో వ్యవహరించాయి. ఛేంబర్‌కు ప్రొజెస్టిరాన్‌ను జత చేసినప్పుడు శుక్రకణాలు తమ దిశను సరిదిద్దుకోగలిగినట్టు కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, మనుషులపై మైక్రోగ్రావిటీ ప్రభావం గురించి పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు జరగాలని కూడా శాస్త్రవేత్తలు చెప్పారు.

ఈ వార్తలూ చదవండి:

డ్యాన్స్ చేస్తూ పిల్లాడి మూతి పగులగొట్టిన రోబో

అక్కడ ఒక సంవత్సరం అంటే 11 గంటలే.. ఈ వింత గ్రహం గురించి తెలిస్తే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy