Dailyhunt
గెజిట్‌ అమలు వాయిదా వేయండి

గెజిట్‌ అమలు వాయిదా వేయండి

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చే గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలును వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.

ఇందుకోసం శుక్రవారం సాయంత్రం మూడు రోజుల పర్యటనపై ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం అసెంబ్లీ తొలి రోజు సమావేశాల తర్వాత బీఏసీలో పాల్గొని ముఖ్యమంత్రి ఢిల్లీకి బయల్దేరుతారు. శనివారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలుసుకుంటారు. ఇప్పటికే గెజిట్‌ అమలులో సమస్యలను కేంద్రానికి వివరించిన కేసీఆర్‌ తాజాగా గెజిట్‌ను వాయిదా వేయాలని కోరనున్నట్లు తెలిసింది. అక్టోబరు 14వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని షెడ్యూల్‌-2లో ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డుల చేతిల్లోకి వెళ్లనున్నాయి. గెజిట్‌ అమలులో భాగంగా సంస్థాగత నిర్మాణంపై వెనువెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై మంజూరైన పోస్టుల వివరాలు, ప్లాంట్‌, మిషనరీ తదితర వివరాలను కూడా బోర్డులకు సమర్పించేసింది. తెలంగాణలో 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్‌ను అందించడానికి కీలకమైన జల విద్యుత్‌ కేంద్రాలు కూడా బోర్డుల ఆధీనంలోకి వెళ్లనుండటంపై తెలంగాణ ప్రభుత్వంతో ఆందోళనతో ఉంది.

ఈ ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి వెళితే ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. గెజిట్‌ను ఇప్పటికిప్పుడే కాకుండా 2022 జనవరి దాకా వాయిదా వేయాలని కోరే అవకాశాలున్నాయి. కృష్ణా జలాల్లో వాటాల పంపిణీ కోసం బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌కే అంతరాష్ట్ర జలవివాదాల చట్టం-1956లోని సెక్షన్‌-3 ప్రకారం బాధ్యతలు అప్పగించాలని లేదా కొత్త ట్రైబ్యునల్‌ వేయాలని కేసీఆర్‌ కోరనున్నారు. గెజిట్‌లో గోదావరి పరిధిలో 11 తెలంగాణ ప్రాజెక్టులను అనుమతి లేని జాబితాలో పెట్టారు. ఆ జాబితా ప్రకారం 6 ప్రాజెక్టుల డీపీఆర్‌లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సమర్పించింది. మిగతా రెండు డీపీఆర్‌ (మొడికుంట వాగు, చనాకా కొరాటా)లను హైదరాబాద్‌ సీడబ్ల్యూసీ కార్యాలయంలో సమర్పించారు. సీతారామ, తుపాకులగూడెం, చౌటపల్లి హనుమంతరెడ్డి, చిన్న కాళేశ్వరం డీపీఆర్‌లను న్యూఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో అందించారు. వీటిని గోదావరి బోర్డులో కూడా అందించారు. ఇక అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో ఉన్న కాళేశ్వరం ఒకటో టీఎంసీ, గూడెం లిఫ్టు, కాంతానపల్లి, రామప్ప-పాకాల లింకు, కందకూర్తి ఎత్తిపోతల పథకాలను జాబితా నుంచి తొలగించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కోరారు.

తాజాగా మరోమారు అదే డిమాండ్‌ చేస్తూ, సమర్పించిన డీపీఆర్‌లకు వేగంగా అనుమతినివ్వాలని కోరే అవకాశాలున్నాయి. కృష్ణాలో అనుమతి లేని ప్రాజెక్టులను నిలిపివేయాలని, అనుమతి లేనప్పటికీ పూర్తయిన ప్రాజెక్టుల కార్యకలాపాలను నిలిపి వేయాలని కేంద్రం గెజిట్‌లో చెప్పింది. అయితే, కృష్ణా జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించాలనే డిమాండ్‌పై బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌లో విచారణ కొనసాగుతున్న విషయాన్ని సీఎం కేంద్ర జల వనరుల మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956 లోని సెక్షన్‌-3 ప్రకారమే కృష్ణా జలాలను పునర్‌ పంపిణీకి ట్రైబ్యునల్‌ వేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ నిర్ణయించినా ఏపీ అభ్యంతరాలతో ఫుల్‌బెంచ్‌కు బదలాయించిన వ్యవహారాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తారు.

కృష్ణాలో నీటి వాటాలు తేలేదాకా వరద జలాలపై కడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోరాదని, వివిధ సంస్థల నుంచి రుణరూపంలో తీసుకుంటున్న నిధుల విడుదలకు అభ్యంతరాలు వ్యక్తం చేయరాదని కోరే అవకాశాలున్నాయి. ఈ నెల 1న ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులు అమిత్‌షా, షెకావత్‌, గడ్కరీలను కలిశారు. 8 రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈసారి మూడు రోజుల పర్యటనపై వెళుతున్నారు. 25న జల వనరుల మంత్రితో సమావేశం అవుతారు. 26న నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్‌షా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొంటారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి పీయూష్‌ గోయెల్‌తో భేటీ అవుతారు. సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy