Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గిరిజనులకు  మేలు చేయని 1/70

గిరిజనులకు మేలు చేయని 1/70

షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజనులు స్వేచ్ఛగా జీవించడానికి, వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆస్తులు, జీవన విధానాన్ని పరిరక్షించడానికి 1/70 చట్టాన్ని తీసుకువచ్చారు.

కానీ ఈ యాభయ్యేళ్లలో అది గిరిజనులకు ఏ మేరకు ఉపయోగపడింది అన్నది ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉన్నది. 1970 తర్వాత ఈ చట్టం గిరిజనులకు ఒక్క ఎకరం భూమినైనా పెంచగలిగిందా? అన్న ప్రశ్నకు మనం జవాబు ఆలోచించాలి.

1970 తర్వాత అడవిని కొట్టి కొత్తగా సాగులోకి తెచ్చుకున్న భూమిని పక్కనపెడితే, ఈ అయిదు దశాబ్దాల్లో గిరిజనేతరుల నుంచి చట్టబద్ధమైన క్రయవిక్రయాల ద్వారా గిరిజనులకు కొత్తగా సంక్రమించిన భూమి చాలా తక్కువ. అదే సమయంలో గిరిజనేతరుల మధ్య, వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు, ఒప్పందాలు, ఇతర మార్గాల ద్వారా పెద్ద ఎత్తున భూ లావాదేవీలు జరిగాయన్నది వాస్తవం. ఈ వ్యవహారాల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అక్రమంగా పెద్ద ఎత్తున సంపాదించుకున్నారన్నది బహిరంగ రహస్యం.

౧/70 చట్టం ఒకవైపు గిరిజన భూములు గిరిజనేతరులకు వెళ్లకుండా అడ్డుకున్నది నిజమే కానీ, మరోవైపు గిరిజన రైతు తన భూమికి అవసరమైన సమయంలో సరైన విలువ పొందడానికి అడ్డంకిగా మారింది. గిరిజనుల భూమిని రక్షించాల్సిన 1/70 చట్ట సవరణ, అమలులో మాత్రం గిరిజన రైతుల ఆర్థిక స్వేచ్ఛకే పరిమితులు విధించే వ్యవస్థగా మారింది.

పక్కనే 1/70 అమలు కాని మండలాల్లో వ్యవసాయ భూమి ఎకరానికి రూ.40-50 లక్షల వరకు విలువ పలికే పరిస్థితులు ఉన్నప్పుడు, 1/70 చట్ట పరిధిలోని ప్రాంతాల్లో అదే స్థాయి భూమి విలువ రూ.10 లక్షల లోపే ఉంది, అదే గిరిజనుల భూమి అయితే అంతకంటే తక్కువే. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి భూమి బదలాయింపుపై ఉన్న చట్టపరమైన ఆంక్షలు. అయితే తక్కువ ధరకు భూమి దొరుకుతుంది కదా అని ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఆర్థికంగా మంచి స్థితికి చేరిన గిరిజనులు సైతం 1/70 ఏరియాలో భూములు కొనడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. భవిష్యత్తులో అవసరం వచ్చినప్పుడు తాము కొనుగోలు చేసిన భూమిని తిరిగి అమ్ముకోలేమనే భయమే దానికి కారణం. ఇది గిరిజనుల ఆర్థిక స్వేచ్ఛపై తీవ్రమైన చర్చకు దారితీసే అంశం.

వ్యవసాయ భూమి రైతుకు కేవలం జీవనాధారం మాత్రమే కాదు. అది కుటుంబానికి ఆధారం. తమ ముందు తరతరాలకు ఆధారం. కష్టకాలంలో ఆర్థిక భద్రత. పిల్లల భవిష్యత్తుకు భరోసా. వ్యాపారం చేయడానికి పెట్టుబడి. అవసరమైనప్పుడు ఆర్థిక అభివృద్ధిలో ఒక అడుగు ముందుకు వేయడానికి మూలధనం. అలాంటి పరిస్థితిలో ఒక గిరిజన లేదా గిరిజనేతర రైతు తను సొంతంగా సంపాదించిన లేదా వారసత్వంగా వచ్చిన భూమిని తన అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే లేదా, వారసులకు అందించే విషయంలో ఈ చట్టం గిరిజన/గిరిజనేతరుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తుంది, స్వేచ్ఛాయుత క్రయవిక్రయాల నిషేధం ఏ విధంగా న్యాయ సమ్మతం?

గిరిజన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు లేకుండా చేయడం, ఉపాధి అవకాశాలు రాకుండా చేయడం, భూమిని ఆర్థిక ఆస్తిగా వినియోగించుకునే మార్గాలను పూర్తిగా మూసివేయడం ద్వారా గిరిజనులను అభివృద్ధి చేశామని ప్రభుత్వాలు భావిస్తే, దానికంటే శోచనీయమైన విషయం మరొకటి ఉండదు. రక్షణ అంటే అభివృద్ధిని అడ్డుకోవడం కాదు; గిరిజనుడి హక్కును కాపాడుతూ, అతనికి అభివృద్ధి అవకాశాలను కల్పించడం.

గిరిజనుల భూమిని కాపాడటమన్న 1/70 చట్టం ఉద్దేశాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ 55 సంవత్సరాల తర్వాత మారిన పరిస్థితులకు అనువుగా ఈ చట్టాన్ని సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం గిరిజనుల భూమిని ఎంతవరకు కాపాడింది? గిరిజనుల ఆర్థిక స్థితిని ఎంతవరకు మెరుగుపరిచింది? వారి భూమి విలువను ఎంత పెంచింది? భూ బదలాయింపుపై ఆంక్షల వల్ల గిరిజనులకు జరిగిన మంచీ చెడూ ఏమిటి? ఈ అంశాలన్నిటిపైనా లోతైన సమీక్ష జరగాలి. గిరిజనుల భూమిని రక్షించాలి. అదే సమయంలో గిరిజనుల ఆర్థిక స్వేచ్ఛను కూడా రక్షించాలి.

మంధనపు రామారావు

భారతీయ కిసాన్ సంఘ్ కార్యదర్శి, ఖమ్మం

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy