సమన్వయంతో అటవీ సంపదను కాపాడాలని నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్ 29 (ఆంధ్రజ్యోతి): గోదావరి పరీవాహక ప్రాంతంలోని అడవులు, వన్యప్రాణుల సంరక్షణతో పాటు కలప స్మగ్లింగ్ నివారణకు సమన్వయంతో పనిచేయాలని మూడు రాష్ట్రాల అటవీశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో జాయింట్ పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి.. నిఘాను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లో మహారాష్ట్ర, చత్తీ్‌సగఢ్, తెలంగాణ అటవీ అధికారులు గురువారం భేటీ అయ్యారు.
ఏటూరునాగారం అభయారణ్యంలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పెద్దపులి సంచారం వెలుగులోకి రావడంతో.. గోదావరి తీరం వెంట మూడు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న అడవులు, వన్యప్రాణులను కాపాడటంతో పాటు కలప స్మగ్లింగ్ నివారణపై ప్రధానంగా చర్చించారు.
తెలంగాణలో పెద్ద పులుల సంరక్షణకు మరిన్ని నిధులను మంజూరు చేస్తామని జాతీయ పులుల సంరక్షణ సంస్థ ప్రతినిధి మురళి తెలిపారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో పెద్దపులి సంచరిస్తున్నందున.. ఆయా ప్రాంతాల్లో అటవీ అభివృద్ధికి అవకాశముందని ఆయన అన్నారు. సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రణాళికాబద్ధంగా నిరంతర నిఘా సాధ్యమవుతుందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి(పీసీసీఎఫ్) ఆర్.శోభ అన్నారు.
