Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల భారం

గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల భారం

  • నిధులు లేక ఇబ్బంది

  • కుంటుపడుతున్న అభివృద్ధి పనులు

జమ్మికుంట(కరీంనగర్): గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందించడం, రాత్రివేళ వీధి దీపాలు వెలిగించడం వంటి కనీస సేవలే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు భారంగా మారుతున్నాయి.

ఒకవైపు విద్యుత్‌ బిల్లుల బకాయిలు పేరుకుపోతుండగా, మరో వైపు అభివృద్ధి పనులకు నిధులు లేక గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. బిల్లులు చెల్లించాలని విద్యుత్‌ శాఖ ఒత్తిడి పెంచుతోంది. ఉన్న కొద్దిపాటి నిధులతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలా, లేక విద్యుత్‌ బిల్లులు చెల్లించాలా అనే సందిగ్ధంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్య దర్శులు ఉన్నారు.

మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది జూలై నాటికి మొత్తం 1.49 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటి మోటర్ల నిర్వహణకు వినియోగించే విద్యుత్‌ బిల్లులే ఈ బకాయిలకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. బకాయిల వసూళ్లపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో విద్యుత్‌ శాఖ అధికారులు పంచాయతీ కార్యదర్శులకు నోటీస్‌లు జారీ చేస్తూ చెల్లింపులు చేయాలని కోరుతున్నారు. జనరల్‌ ఫండ్‌ ద్వారా 10 శాతం మేర బకాయిలు చెక్కుల ద్వారా చెల్లించినప్పటికీ అవి పాస్‌ కావడం లేదని కార్యదర్శులు తెలిపారు.

  • అభివృద్ధికి అడ్డంకిగా..

గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్ధిక సంఘం నిధులు వచ్చినప్పుడల్లా వాటిలో ఎక్కువ భాగం విద్యుత్‌ బిల్లుల చెల్లింపులకే వెళ్తోందని అధికారులు అంటున్నారు. దీంతో గ్రామాల్లో చేపట్టాల్సిన సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, తాగునీటి పైపులైన్‌ మరమ్మతులు, పారిశుధ్య కార్యక్రమాలు నిధుల కొరతతో నిలిచిపోతున్నాయని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గ్రామాభివృద్ధి పూర్తిగా దెబ్బతింటోందని అంటున్నారు. విద్యుత్‌ బకాయిల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు కోరుతున్నారు.

విద్యుత్‌ బకాయిలకు శాశ్వత పరిష్కారం చూపాలి

  • తోట కవిత లక్ష్మణ్‌, గండ్రపల్లి గ్రామ సర్పంచ్‌

గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ప్రజల మౌలిక వసతులు కల్పించడానికి వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాటిలో ఎక్కువ భాగం విద్యుత్‌ బిల్లుల చెల్లింపులకే వెళ్తోంది. సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులు కష్టంగా మారుతోంది. విద్యుత్‌ బిల్లులు, సిబ్బంది జీతాలు, ఇతర నిర్వ హణ ఖర్చులతో పంచాయతీలు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్రామాల అభి వృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల సమస్యకు శాస్వత పరిష్కారం చూపాలి.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy