ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడని అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఇనుప గ్రిల్‌లో ఇరుక్కుపోయాడు. ఆ సమయంలో అతడిని కాపాడిల్సింది పోయి..
కొందరు స్థానికులు కర్రలతో చితకబాదారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నానా వరాచా ఏరియా రాజారామ్‌నగర్ సొసైటీలోని ఓ బంగ్లాలో సుమారు 15 రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. వీడియో ప్రకారం.. బంగ్లాలోకి చొరబడేందుకు యత్నించి ఇనుప గ్రిల్‌లో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అతడు తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న స్థానికులు.. అతడిని దొంగగా అనుమానించి కర్రలతో కొట్టారు. అయితే ఆ వ్యక్తి నిజంగా చోరీకి వచ్చాడా? లేక ఇతర కారణమేమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఘటనపై ఇప్పటివరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.
అయితే.. ఆ వ్యక్తి చొరబడేందుకు ప్రయత్నించిన బంగ్లా చాలాకాలంగా ఖాళీగా ఉందని, దాని యజమానులు కొన్నేళ్లుగా విదేశాల్లో స్థిరపడ్డారని పోలీసులు తెలిపారు. అక్కడ ఎలాంటి వస్తువులూ చోరీ అవ్వలేదన్న పోలీసులు.. తాళాలు, తలుపులు బద్ధలుకొట్టిన ఆనవాళ్లేవీ కనిపించలేదన్నారు. వైరల్ వీడియోను పరిశీలిస్తున్న పోలీసులు.. గ్రిల్‌లో చిక్కుకున్న వ్యక్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. అతడు బంగ్లాలోకి ఎలా ప్రవేశించాడు? నిజంగా దోచుకెళ్లాలనే ప్లాన్‌తోనే వచ్చాడా? గ్రిల్‌లో చిక్కుకున్న అనంతరం అతడిపై స్థానికులు ఎందుకు దాడి చేశారు? వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశముంది.

