Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'గ్రీన్‌ గణేశా'కు శ్రీకారం

'గ్రీన్‌ గణేశా'కు శ్రీకారం

  • నేడు మట్టి విగ్రహాల తయారీ లాంఛనంగా ప్రారంభం

  • ఈ ఏడాది 'మన దేవుడు.. మన ఇంట్లోనే' నినాదంతో ముందుకు

  • పర్యావరణ పరిరక్షణే రోటరీ క్లబ్‌ ధ్యేయం

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా 'గ్రీన్‌ గణేశా'కు రోటరీ క్లబ్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌, రోటరీ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌-3150 బుధవారం శ్రీకారం చుట్టనున్నాయి.

2011లో పీసీబీ (పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు) సహకారంతో 200 విగ్రహాలతో ప్రారంభమవగా, ఏటా విగ్రహాల తయారు చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 14న వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయనున్నారు. బుధవారం రాత్రి 7 గంటలకు రోటరీ క్లబ్‌ గవర్నర్‌ హరిహర ప్రసాద్‌, కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండి రమేష్‌ విగ్రహాల తయారీని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

వసంతనగర్‌ కేంద్రంగా..

వసంతనగర్‌లో భగత్‌సింగ్‌నగర్‌ ఫేజ్‌-1, ప్లాట్‌ నంబర్‌ 624 వద్ద మట్టి వినాయక ప్రతిమల తయారీకి శ్రీకారం చుడుతున్నారు. ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగుల విగ్రహాలను తయారు చేయనున్నారు. ముందస్తు బుకింగ్స్‌ను బట్టి వివిధ ఆకారాల్లో నేచురల్‌ కలర్స్‌ అంటే మట్టితో తయారు చేసిన కాటుక, సింధూరం వంటి వాటితో అలంకరిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. కుమ్మరి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ నగర భక్తులకు తక్కువ ధరకే వినాయక విగ్రహాలను తయారు చేసి ఇస్తున్నారు.

రంగు రంగుల విగ్రహాలవైపు వెళ్తున్న యువతకు అవగాహన కల్పిస్తామని రోటరీ క్లబ్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రకటించింది. మట్టి వినాయక విగ్రహాలకు పూజలు చేయాలని సూచిస్తోంది. అపార్ట్‌మెంట్స్‌, కాలనీల్లో విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత ఆ మట్టిని ఇళ్లలో పెరట్లో మొక్కలకు వేస్తే మంచిదంటున్నారు. ఈ ఏడాది ఆసక్తి ఉన్న వారికి మట్టి ఇచ్చి వినాయక ప్రతిమలు తయారు చేయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.

 కాలుష్య నియంత్రణ కోసం చెరువులు, నదుల్లో కాకుండా విగ్రహాలను ఇంటి వద్దనే నిమజ్జనం చేసుకుందాం అంటున్నారు. సామూహిక నిమజ్జనాల వల్ల ట్రాఫిక్‌ అంతరాయంతో పాటు నిమజ్జన ప్రాంతాల్లో ఒత్తిడి తగ్గించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మట్టి వినాయకుడిని ఎంచుకోండి.. ప్రకృతిని పరిరక్షించండి అంటున్నారు. మట్టి వినాయక ప్రతిమల కోసం ఆసక్తిగల వారు 9951413683, 9951913683లో సంప్రదించవచ్చన్నారు.

ప్రజల్లో చైతన్యం కోసమే..

ప్రజల్లో చైతన్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నాం. విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, అపార్ట్‌మెంట్స్‌, కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. 'మన దేవుడు.. మన ఇంట్లోనే' అనే నినాదంతో ఈ ఏడాది వస్తున్నాం. మట్టిని కాస్ట్‌ టూ కాస్ట్‌కు ఇచ్చి ప్రజలతో విగ్రహాలు తయారు చేయించాలనుకుంటున్నాం. ఆసక్తి ఉన్న వారికి అవకాశం కల్పిస్తాం. విద్యావేత్తలు, కమ్యూనిటీ పెద్దలు ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి.

  • ఎం. విజయభాస్కర్‌, కమ్యూనిటీ సర్వీస్‌ డైరెక్టర్‌, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy