శాశ్వత నివాస హక్కు (Green Card) కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లాలని ఇటీవల ప్రకటించిన అమెరికా ప్రభుత్వం తాజాగా వెనక్కి తగ్గింది.
ఆ నిబంధన అందరికీ వర్తించదని, దరఖాస్తును బట్టి ఇమిగ్రేషన్ అధికారులు నిర్ణయం తీసుకుంటారని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) తాజాగా ప్రకటించింది (US Green Card Rules).
తాత్కాలిక వీసాలపై ఉన్నవారు గ్రీన్ కార్డ్ పొందాలంటే తమ స్వదేశంలోనే దరఖాస్తు చేసుకోవాలని గత వారం అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ప్రకటనతో హెచ్1బీ వీసాదారులు, విదేశీ విద్యార్థులు, తాత్కాలిక ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీనిపై తాజాగా డీహెచ్‌ఎస్ వివరణ ఇచ్చింది. ఈ నిబంధన ఎప్పట్నుంచో ఉందని, ఇమిగ్రేషన్ అధికారులకు తమ విచక్షణాధికారాన్ని గుర్తు చేయడానికే గత వారం తాము మార్గదర్శకాలు విడుదల చేశామని తెలిపింది (Green Card Applicants).
దరఖాస్తుదారుడి పరిస్థితులు, ఆర్థిక ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల వంటి అంశాలను పరిశీలించి అతడు అమెరికాలో ఉండాలా, స్వదేశానికి వెళ్లాలా అనే విషయంపై ఇమిగ్రేషన్ అధికారులు నిర్ణయం తీసుకుంటారని డీహెచ్‌ఎస్ తెలిపింది (Green Card Process). ప్రత్యేకించి అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే లేదా జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్నవారికి మినహాయింపులు లభించే అవకాశం ఉందని యూఎస్‌సీఐఎస్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.

