Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గురుగ్రామ్‌లో దారుణం.. వెంటపడొద్దన్నందుకు మహిళా బైకర్‌ను..

గురుగ్రామ్‌లో దారుణం.. వెంటపడొద్దన్నందుకు మహిళా బైకర్‌ను..

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డుపై తనను వెంబడిస్తున్న వారిని ప్రశ్నించిన ఓ మహిళా బైకర్‌పై కారు దూసుకెళ్లిన ఘటన గురుగ్రామ్‌లో కలకలం రేపుతోంది. గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆమె బైక్‌కు అమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డయ్యాయి.

స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న సియా అనే మహిళను కొందరు వ్యక్తులు కారులో వెంబడించినట్లు తెలుస్తోంది. తనను ఎందుకు ఫాలో అవుతున్నారని ఆమె వారించగా.. కొంత దూరం వెళ్లిన తర్వాత వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆమె బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో సియా రోడ్డుపై పడిపోగా.. బైక్ కొంత దూరం వరకు జారుకుంటూ వెళ్లింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆమె వెనుకే వస్తున్న స్నేహితులు వెంటనే కారును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ.. అందులోని వ్యక్తులు వారితో దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయినట్లు బాధితురాలు తెలిపింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సియా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. తనను ఫాలో చేయొద్దు.. దూరంగా ఉండాలి అని చెప్పినంత మాత్రాన ఇంత దారుణానికి తెగబడ్డారని సియా ఆరోపించింది. ఈ సమయంలో వారు మద్యం మత్తులో ఉన్నట్లు తనకు అనిపించిందని పేర్కొంది. వీడియోపై స్పందించిన గురుగ్రామ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. ఘటనకు సంబంధించిన కారు రిజిస్టర్డ్ యజమాని మనీష్ స్పందిస్తూ.. ప్రమాదం జరిగిన సమయంలో తాను కారును నడపడం లేదని అన్నారు. సోమవారం ఉదయం మాత్రమే ఈ విషయం తనకు తెలిసిందని వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు వాహనాన్ని నడిపిన వ్యక్తి ఎవరు.. అసలు ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటనే కోణంలో విచారణ చేపట్టారు. రోడ్డుపై ఇతర వాహనదారులకు ప్రమాదం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సియా పోలీసులను కోరింది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy