Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్యాస్‌, గుండెపోటు మధ్య తేడా ఏంటి? ఈ విషయాలు తెలుసుకోండి

గ్యాస్‌, గుండెపోటు మధ్య తేడా ఏంటి? ఈ విషయాలు తెలుసుకోండి

ఇంటర్నెట్ డెస్క్: ఛాతీలో మంట, నొప్పి లేదా అసౌకర్యం కనిపించినప్పుడు చాలామంది దాన్ని గ్యాస్‌ సమస్యగా భావిస్తుంటారు. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం, వికారం వంటి లక్షణాలు ఉంటే గ్యాస్ట్రిక్‌ సమస్యేనని అనుకుంటారు.

అయితే ఇలాంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఛాతీలో అసౌకర్యం కలిగినప్పుడు కారణాన్ని నిర్ధారించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు.

గ్యాస్‌ సమస్య ఎలా ఉంటుంది?

గ్యాస్ట్రిక్‌ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా పొట్ట పైభాగంలో అసౌకర్యం, ఛాతీ కింది భాగంలో నొప్పి లేదా మంట కనిపించవచ్చు. కడుపు ఉబ్బినట్లు అనిపించడం, తేన్పులు రావడం, అజీర్తి వంటి సమస్యలు కూడా ఉండొచ్చు. అయితే కేవలం లక్షణాలను బట్టి ఇది గ్యాస్‌ సమస్యేనని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు.

గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయి?

గుండెకు రక్తప్రసరణ తగ్గినప్పుడు ఛాతీలో బిగుతుగా, భారంగా లేదా ఒత్తిడిగా అనిపించవచ్చు. కొందరిలో ఛాతీ నొప్పితో పాటు వికారం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో గుండె సమస్య లక్షణాలు అజీర్తి లేదా గ్యాస్‌ సమస్యను పోలి ఉండే అవకాశం ఉంది. అందుకే ఛాతీ నొప్పిని కేవలం గ్యాస్‌ అని భావించి ఇంట్లోనే ఉండిపోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు.

ఎవరు మరింత అప్రమత్తంగా ఉండాలి?

వయసు పెరిగేకొద్దీ గుండె సంబంధిత సమస్యలపై జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, ధూమపానం, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర వంటి అంశాలు ఉన్నవారు ఛాతీ సంబంధిత లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. ఛాతీలో కొత్తగా లేదా తీవ్రమైన నొప్పి రావడం, నొప్పి తగ్గకుండా కొనసాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, మూర్ఛ లేదా తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే..

రోజువారీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

  • అధికంగా నూనె, ఉప్పు, చక్కెర ఉండే ఆహారాన్ని తగ్గించాలి.

  • తరచుగా జంక్‌ఫుడ్‌ తీసుకునే అలవాటును తగ్గించుకోవాలి.

  • ధూమపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

  • మద్యపానం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

  • మధుమేహం, అధిక రక్తపోటు ఉంటే వైద్యుల సూచనల ప్రకారం నియంత్రణలో ఉంచుకోవాలి.

  • తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, గింజలు వంటి పోషక పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

  • అవసరానికి అనుగుణంగా కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని నియంత్రించాలి.

  • క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి.

  • రోజూ తగినంత నిద్ర పొందాలి.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

రక్షాబంధన్‌ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy