హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం చార్మినార్ ప్రాంతంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ నటి ప్రత్యూష పాల్‌పై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆమెపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు అతడికి ఏడు రోజుల జైలు శిక్ష విధించింది.
చార్మినార్ సందర్శనకు వచ్చిన నటి..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన నటి ప్రత్యూష పాల్ ఈ నెల 2వ తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. తన పర్యటనలో భాగంగా సాయంత్రం సమయంలో చార్మినార్ ప్రాంతాన్ని సందర్శించారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో షాపింగ్ చేస్తూ ఫుట్‌పాత్ వద్ద వస్తువులు చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసభ్య ప్రవర్తన..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌక్‌కు చెందిన అబ్దుల్ వాజీద్ (40) అనే వ్యక్తి నటి ప్రత్యూష పాల్‌ను గమనించి ఆమె వెంటపడడం ప్రారంభించాడు. 2వ తేదీ సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో ఆమెను అనుసరిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నటి కుటుంబ సభ్యులతో ఉన్నప్పటికీ నిందితుడు వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. ఫుట్‌పాత్ వద్ద షాపింగ్ చేస్తుండగా పదేపదే ఆమెకు దగ్గరగా వచ్చి అసౌకర్యానికి గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు..
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన నటి ప్రత్యూష పాల్ వెంటనే చార్మినార్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని పోలీసులు స్పష్టం చేశారు.
నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష..
అరెస్టు చేసిన అబ్దుల్ వాజీద్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు నిందితుడికి 7 రోజుల జైలుశిక్ష విధించింది. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో మహిళల భద్రతను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
చార్మినార్ ప్రాంతంలో భద్రతపై చర్చ..
చార్మినార్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు, మహిళలు, విదేశీయులు సందర్శించే ఈ ప్రాంతంలో పోలీసు నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఉందని పలువురు సందర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకించి ఫుట్‌పాత్ మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు, రాత్రి సమయాల్లో షాపింగ్ ప్రాంతాల వద్ద అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
మహిళల భద్రతపై పోలీసులు హెచ్చరిక..
మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. యువతులపై ఈవ్‌టీజింగ్, అసభ్య ప్రవర్తన, వెంటపడటం వంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. అలాగే మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే డయల్ 100, షీ టీమ్స్, స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
.
జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్ కేసుపై సజ్జనార్ స్పెషల్ ఫోకస్
పంజాబ్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. రాఘవ్ చద్దా ధ్వజం
అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. పదిమంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News

