Monday, 24 May, 10.21 am ఆంధ్రజ్యోతి

హైదరాబాద్
హైదరాబాద్‌లో ఇక్కడ తినాలంటే వణికిపోతున్న జనాలు!

హైదరాబాద్‌ సిటీ : రైల్వేస్టేషన్లలోని ఫుడ్‌కోర్టులు (ఆహారశాలలు) బోసిపోతున్నాయి. ప్రయాణికుల సందడి లేక కళా విహీనంగా కనిపిస్తున్నాయి. గతంలో ఉదయం 5 నుంచి రాత్రి 11 వరకు క్షణం తీరిక లేకుండా వ్యాపారాన్ని కొనసాగించిన నిర్వాహకులు, నిర్విరామంగా పనిచేసిన సిబ్బంది.. కొన్ని రోజులుగా ఖాళీగా ఉంటున్నారు. ప్యాసింజర్ల సంఖ్య పెరిగి గిరాకీ పుంజుకుంటుందేమోనని, రోజువారీ నిర్వహణ ఖర్చులైనా వస్తాయేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్‌, గుంతకల్లు డివిజన్లలో సుమారు 120 వరకు ఫుడ్‌కోర్టులు, క్యాంటీన్లు నడుస్తున్నాయి. ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు కావాల్సిన టీ, టిఫిన్లు, భోజనాలు, వాటర్‌బాటిళ్లు, తినుబండారాలను విక్రయించేందుకు ప్రతి రెండేళ్లకోసారి టెండర్‌ ప్రాతిపదికన రైల్వేశాఖ నిర్వహణ బాధ్యతలు కట్టబెడుతోంది. ఈ క్రమంలో ఆయా స్టేషన్లలో పలువురు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. పాలు, కూరగాయలు, పప్పు దినుసుల సరఫరా మొదలుకుని క్యాంటీన్లలో వంటలు చేస్తూ, వినియోగదారులకు ఆహారాన్ని సప్లయ్‌ చేస్తూ వందలాది మంది కుటుంబాలను పోషించుకుంటున్నారు.

గతంలో పరిస్థితి ఇలా...

దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువైన సికింద్రాబాద్‌తోపాటు వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్లు, నాందేడ్‌ డివిజన్‌ స్టేషన్లలో పెద్ద ఫుడ్‌ కోర్టులు నడుస్తున్నాయి. వీటితోపాటు హైదరాబాద్‌, కాచిగూడ, భువనగిరి, కాజీపేట, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, బోనకల్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్ల్లో సెకండరీ గ్రేడ్‌ క్యాంటీన్లు నడుస్తున్నాయి. కాగా, ఫుడ్‌ కోర్టుల్లో టీ, టిఫిన్‌, భోజనాలు, ఫాస్ట్‌ఫుడ్‌తోపాటు వివిధ రకాల వస్తువులు లభిస్తుండగా, క్యాంటీన్లలో టీ, టిఫిన్‌, బిస్కెట్లు, ఇతర తినుబండారాలు, వాటర్‌ బాటిళ్లను విక్రయిస్తుంటారు.

రైళ్లలో ప్రయాణించే వారు తమకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆయా స్టేషన్ల క్యాంటీన్లలో కొనుగోలు చేసుకునేవారు. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 16నుంచి ఇప్పటివరకు ఫుడ్‌కోర్టులు, క్యాంటీన్ల నిర్వాహకులు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనాకు ముందు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రతిరోజూ దాదాపు 744కిపైగా రైళ్లు నడిచాయి. ఇందులో కేవలం సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచే 120కి పైగా రైళ్లు నడవగా.. రోజుకు 1.20 లక్షల మంది ప్రయాణించేవారు. అలాగే హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి 40వేలు, కాచిగూడ నుంచి 70వేలు, లింగంపల్లి నుంచి 30వేల మంది ప్యాసింజర్లు రాకపోకలు సాగించడంతో ఆయా స్టేషన్లు 24 గంటలపాటు రద్దీగా ఉండేది. ఈ క్రమంలో ఫుడ్‌కోర్టులు, క్యాంటీన్లు సందడిగా కనిపించేవి.

కరోనాతో కొనుగోళ్లకు వెనకంజ...

కరోనా తాకిడితో రెండేళ్లుగా రైల్వేస్టేషన్లు బోసిపోతున్నాయి. కొవిడ్‌తో 2020 మార్చి 16న నిలిచిపోయిన రైళ్లు కరోనా ఆంక్షలకు అనుగుణంగా అదే ఏడాది జూన్‌ 1 నుంచి ప్రారంభమయ్యాయి. తొలుత రోజుకు 8 రైళ్లను మాత్రమే నడిపించిన దక్షిణ మధ్య రైల్వే దేశంలో కొవిడ్‌ కేసులు తగ్గిన తరుణంలో పెంచుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ మొదటివారం వరకు రోజుకు 270 రైళ్లను నడిపించగా.. కరోనా రెండో దశ కేసులు పెరిగిపోవడంతో కొన్ని రోజులుగా తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం 80 నుంచి 100 రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఓ వైపు రైళ్ల సంఖ్య తక్కువ కావడంతోపాటు మరోవైపు కరోనా భయంతో ఆహార పదార్థాలను తినేందుకు ప్రయాణికులు భయపడుతున్నారు.

ఫుడ్‌కోర్టుల్లో నిర్వాహకులు, సిబ్బంది ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించడంతోపాటు ప్రతి అరగంటకోసారి శానిటేషన్‌ చేస్తూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాలామంది ప్యాసింజర్లు తినుబండరాల కొనుగోళ్లకు వెనకంజ వేస్తున్నారు. కాగా, దూర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికుల్లో కొందరు ఇంటి నుంచే భోజనాలు తయారు చేసుకుని తీసుకెళ్తుండగా, మరికొందరు తప్పనిసరి పరిస్థితిలో తింటున్నారు. ఇదిలా ఉండగా, పలు ఫుడ్‌కోర్టులు, క్యాంటీన్లలో కేవలం వాటర్‌బాటిళ్లు, బిస్కెట్లు మాత్రమే అంతంతమాత్రంగా అమ్ముడుబోతున్నట్లు సమాచారం.

రెండేళ్లుగా నష్టాలు..

రూ. లక్షలు వెచ్చించి టెండర్లు దక్కించుకున్న ఫుడ్‌కోర్టులు, క్యాంటీన్ల నిర్వాహకులు కరోనాతో రెండేళ్లుగా నష్టాలు ఎదుర్కొంటున్నారు. గతంలో సికింద్రాబాద్‌ ఫుడ్‌కోర్టులో రోజుకు సుమారు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు అమ్మకాలు చేపట్టగా.. ప్రస్తుతం రోజంతా కలిపి రూ.25 వేల విక్రయాలు చేపట్టడంలేదని తెలుస్తోంది. కాగా, స్టేషన్లలో క్యాంటీన్ల పరిస్ధితి మరీ దారుణంగా ఉంది. ఓ వైపు రైళ్ల సంఖ్య భారీగా తగ్గిపోవడంతోపాటు మరోవైపు ఉదయం 10 నుంచి లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో రైళ్లు ఎక్కేందుకు ఎవరూ రావ డం లేదు. దీంతో కొంతమంది పది రోజుల నుంచి క్యాం టీన్లను తెరవడం లేదని సమాచారం. కరోనా కష్టకాలాన్ని దృష్టిలో ఉంచుకుని టెండర్‌ గడువును పొడిగించి ఆదుకోవాలని రైల్వే అధికారులను కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top