Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణకు పీపీపీఏసీ ఆమోదం

హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణకు పీపీపీఏసీ ఆమోదం

  • బందరు వరకూ 285కిమీ మేర..

  • 6 వరుసలుగా విస్తరణ

  • రూ.12 వేల కోట్లతో పనులు!

  • ప్రయాణించిన దూరానికే టోల్‌ ..

  • కేంద్ర క్యాబినెట్‌ ఆమోదానికి ఫైలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 65 (హైదరాబాద్‌- విజయవాడ హైవే) విస్తరణలో కీలక ముందడుగు పడింది.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకూ 285 కిలోమీటర్ల మేర.. ఈ రహదారిని రూ.12,073.99 కోట్లతో 6 వరుసలుగా విస్తరించేందుకు పబ్లిక్‌-ప్రైవేట్‌-పార్టనర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ పనులను 3 ప్యాకేజీలుగా విభజించారు. హైదరాబాద్‌ దగ్గర ఓఆర్‌ఆర్‌ తరువాత వచ్చే ఆందోల్‌ మైసమ్మ ఆలయం నుంచి విజయవాడలోని గొల్లపూడి వరకు 181 కి.మీ మేర ఒక ప్యాకేజీ, హైదరాబాద్‌ నుంచి నందిగామ వరకూ 45 కి.మీ మేర రెండో ప్యాకేజీ, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 59.69 కి.మీ మేర మూడో ప్యాకేజీ పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు పనులను బిల్డ్‌-ఆపరేట్‌-టోల్‌ (బోట్‌) పద్ధతిలో, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో పనులు చేయనున్నారు.

కిలోమీటరుకు రూ.38 కోట్లు

అధికారుల అంచనాల ప్రకారం.. ప్యాకేజీ-1 పనులకు రూ.7,321.97 కోట్లు, ప్యాకేజీ-2 పనులకు రూ.2,965.11 కోట్లు, ప్యాకేజీ-3 పనులకు రూ.1,786.91 ఖర్చు కానుంది. భూసేకరణ, నిర్మాణ పనులు, జీఎస్టీ ఇలా అన్ని ఖర్చులూ కలిపి ఒక్కో కిలోమీటరుకు సగటున రూ.38 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా. తెలంగాణలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌, కృష్ణా జిల్లాల మీదుగా రోడ్డు విస్తరణ జరగనుంది. భూసేకరణకు.. తెలంగాణ పరిధిలోని ప్యాకేజీ-1కి రూ.529.45కోట్లు, ప్యాకేజీ-2కి రూ.924.43 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. రెండు ప్యాకేజీలకూ కలిపి 1,387.628 హెక్టార్ల భూమి అవసరమని తేలగా, ఇందులో 1,174.295 హెక్టార్ల భూమి అందుబాటులో ఉంది. అదనంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సింది 213.33 హెక్టార్లే. అలాగే విజయవాడ-మచిలీపట్నం మార్గంలో విస్తరణకు 351.185 హెక్టార్లు కావాల్సి ఉండగా.. 344.685 హెక్టార్లు అందుబాటులో ఉంది. అంటే అదనంగా కావాల్సింది 6.50 హెక్టార్లే.

హై స్పీడ్‌ కారిడార్‌..

ఎన్‌హెచ్‌-65లో హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం మార్గం మొత్తాన్ని 'హై స్పీడ్‌ కారిడార్‌'గా మార్చనున్నారు. 6 వరుసలుగా విస్తరించి, రెండు వైపులా క్రాష్‌ బారియర్స్‌ ఏర్పాటుచేయనున్నారు. అంటే ఇప్పుడున్న రెండు వరుసల రోడ్డుకు అటుఇటు మరొక రోడ్డు వస్తుంది. దీనికి అదనంగా రోడ్డుకు రెండువైపులా రెండు వరుసలుగా సర్వీస్‌ రోడ్డును అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం దూరంలో ప్రతీ 15-18 కిలో మీటర్లకు ఒక దగ్గర ఎంట్రీ-ఎగ్జిట్‌ పాయింట్లను ఇవ్వనున్నారు. దీని ప్రకారం రెండు వైపులా కలిపి 30 చోట్ల టోల్‌ ప్లాజాలు రానున్నాయి. అయితే ఈ మార్గం విస్తరణలో భాగంగా.. ప్రయాణించిన దూరానికే టోల్‌ వసూలు చేసేలా కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఔటర్‌ రింగు రోడ్డు తరహాలో.. ఈ రహదారి ఎక్కే సమయంలో స్కాన్‌ అవుతుంది. మళ్లీ ఎక్కడ దిగాలనుకుంటామో అక్కడే టోల్‌ ఉంటుంది. కాగా.. ఈ పనులకు కీలక పీపీపీఏసీ ఆమోదం లభించడంతో ఈ ఫైలు కేంద్ర క్యాబినెట్‌కు చేరనుంది. మంత్రివర్గ ఆమోదం కూడా లభిస్తే వెంటనే నిర్మాణానికి చర్యలు చేపడతారు.

ఈ వార్తలు కూడా చదవండి

కొండా సురేఖ అంశంపై ఎటువంటి ఆదేశాలు లేవు

టాప్‌-4వ రైల్వేస్టేషన్‌గా సికింద్రాబాద్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy