Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు

హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు

సిద్ధిపేట, జూన్12: సంక్షేమ శాఖలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తాను, మైనార్టీ శాఖ మంత్రిగా అజారుద్దీన్, ఎస్సీ, ఎస్టీ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ ఉన్నామని పేర్కొన్నారు. మైనార్టీ, బీసీ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల్లో పారదర్శకంగా మంత్రులుగా సంబంధం లేకుండా ప్రిన్సిపాల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్‌కు తాము నిర్ణయాధికారం ఇచ్చామని గుర్తు చేశారు.

అయితే అవినీతి జరిగిందంటూ హరీశ్ రావు అవగాహన లేకుండా మాట్లాడి ఆయన.. తన స్థాయిని తగ్గించుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో చేసిన విధంగా అవినీతి జరుగుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ పక్షాన చెబుతున్నానని.. సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని రుజువు చేస్తే దేనికైనా సిద్ధమన్నారు. పేదలకు విద్య, నాణ్యమైన ఆహారం అందాలనే ఆలోచన తమకు ఉందని తెలిపారు. తమ శాఖల్లో తప్పు జరిగిందనేందుకు ఎలాంటి విచారణకు అయినా తాము దేనికైనా సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

హరీశ్ రావుకు అక్కసు ఎందుకు?: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఖండించారు. ఈ అవినీతిపై చర్చించేందుకు మీరే డేట్ టైమ్ ఫిక్స్ చేయండి.. చర్చిద్దామంటూ హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. గురుకుల విద్యార్థుల షూస్, యూనిఫాం, బుక్స్ టెండర్‌లో రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగిందన్న హరీష్ రావు ఆరోపణలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. తాము జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచామని గుర్తు చేశారు.

మొత్తం టెండర్ విలువే రూ.687 కోట్లు అని వివరించారు. రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్ రావు పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. వారు అవినీతి చేసినట్లే తాము చేశామని అనుకుంటున్నారా? అంటూ బీఆర్ఎస్ నేతను మంత్రి సూటిగా ప్రశ్నించారు. ఏడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ కోసం తాము మంచి ఆలోచన చేస్తే హరీశ్ రావుకు అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు. మీరు గురుకులాలకు ఒక్క కొత్త భవనం అయినా నిర్మించారా?.. ఎస్సీ విద్యార్థుల కోసం ఒక్క హాస్టల్ భవనం అయినా కట్టించారా? అని హరీశ్ రావుకు ఈ సందర్భంగా ప్రశ్నలు సంధించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ హరీశ్ రావుకు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలకు కూడా కొంత శాతం ప్రొక్యూర్‌మెంట్‌కు అవకాశం ఇచ్చామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.

గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణ: మంత్రి శ్రీధర్‌బాబు

రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ

Read Latest Telangana News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy