Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హెచ్‌-1బీ నిబంధనలు సరళతరం చేయండి

హెచ్‌-1బీ నిబంధనలు సరళతరం చేయండి

తెలంగాణ విద్యార్థులకు వీసా స్లాట్లు పెంచండి.. వారి సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

  • అమెరికా యూనివర్సిటీలు తెలంగాణలోని విద్యాసంస్థలతో కలిసి పనిచేసేలా ప్రోత్సహించండి

  • అమెరికా రాయబారితో సీఎం రేవంత్‌

  • సెర్జియో గోర్‌తో సీఎం భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసా నిబంధనల్ని సరళతరం చేయాలని ఆ దేశ రాయబారి సెర్జియో గోర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణ విద్యార్థులకు వీసా స్లాట్లు పెంచాలని, వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో సెర్జియో గోర్‌తో రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రగతి, ఉన్నత విద్య, వీసా సమస్యలు, పెట్టుబడుల ప్రాధాన్య అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోందని సీఎం తెలిపారు. అభ్యర్థులకు వీసా అపాయింట్‌మెంట్లు సకాలంలో లభించేలా చొరవ చూపాలని, వీసా ఇంటర్వ్యూ స్లాట్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని కోరారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ నిపుణుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హెచ్‌-1బీ వీసాల నిబంధనల్లో ఎలాంటి మార్పులు తెచ్చినా ఆ సమాచారాన్ని ముందస్తుగా తెలియజేయాలని అన్నారు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల భద్రత, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్థ వహించాలన్నారు.

తెలంగాణ విద్యాసంస్థలతో కలిసి పనిచేయాలి..

విద్యా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అమెరికాలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు తెలంగాణలోని విద్యాసంస్థలతో కలిసి పనిచేసేలా ప్రోత్సహించాలని సెర్జియో గోర్‌ను సీఎం రేవంత్‌ కోరారు. ఉమ్మడి పరిశోధనలు, ఆవిష్కరణలు, విద్యార్థుల మార్పిడి (స్టూడెంట్‌ ఎక్స్ఛేంజ్‌), నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో అమెరికా సంస్థలకు విస్తృతమైన పెట్టుబడి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, ఐటీ, ఏఐ, లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, స్టార్ట్‌పలు, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికన్‌ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను నెలకొల్పేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. కాగా, అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారతీయ భాషల్లో తెలుగు భాష ఒకటని ఈ సందర్భంగా రేవంత్‌ గుర్తుచేశారు. భారతీయ సంస్కృతి, ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయాలు, ఇక్కడి వంటకాలపై రాయబారి సెర్జియో గోర్‌కు ఉన్న అవగాహనను సీఎం అభినందించారు. సీఎం విజ్ఞప్తులపై సెర్జియో గోర్‌ సానుకూలంగా స్పందించారు.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy