Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హోర్ముజ్ జలసంధి పేరు మార్చేస్తే పోలా.. డొనాల్డ్ ట్రంప్ కామెంట్

హోర్ముజ్ జలసంధి పేరు మార్చేస్తే పోలా.. డొనాల్డ్ ట్రంప్ కామెంట్

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. హోర్ముజ్ తమ ఆధీనంలోనే ఉందని ఇరు దేశాలు ఇప్పటికే పలుమార్లు పోటాపోటీగా ప్రకటించుకున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హోర్ముజ్‌పై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఇటీవల గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చిన ట్రంప్.. హోర్ముజ్‌ పేరును కూడా మార్చేయాలని అభిప్రాయపడ్డారు.

'హోర్ముజ్ అమెరికా ఆధీనంలోకి వచ్చేసింది కాబట్టి దాని పేరు మార్చేస్తే ఎలా ఉంటుంది? ట్రంప్ జలసంధి అని పెడితే ఎలా ఉంటుంది? మునుపటి పేరు కంటే ఇది ఆకర్షణీయంగా ఉంటుందిగా?' అని కామెంట్ చేశారు. ఇరాన్‌పై యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) మళ్లీ దాడులు ప్రారంభించిన నేపథ్యంలో బుధవారం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలు, ఇతర తీర ప్రాంత కేంద్రాలను ధ్వంసం చేశామని సెంట్‌కామ్ ఒక ప్రకటనలో తెలిపింది. సీమైన్స్ ఏర్పాటు చేసే సామర్థ్యాలను దెబ్బతీశామని పేర్కొంది. ఇరాన్ ప్రత్యేక సైనిక దళం ఐఆర్‌జీసీ సమాచార వ్యవస్థలను కూడా దెబ్బతీశామని పేర్కొంది.

ఈ దాడులపై ఇరాన్ స్పందించింది. సామాన్యులే టార్గెట్‌గా అమెరికా దాడులు సాగాయని ఆరోపించింది. మౌలిక వసతులు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఖుజెస్థాన్, సిస్థాన్, బలుచెస్థాన్, హోర్మోజ్‌గాన్, కెర్మన్ ప్రాంతాల్లో అమెరికా దాడులు జరిగాయని చెప్పింది. సిరిక్ కౌంటిలో జరిగిన దాడి ఓ పెళ్లింట విషాదం నింపిందని కూడా ఆరోపించింది. ఇరాన్ మీడియాలో ఇందుకు సంబంధించి వస్తున్న వార్తలను తాము చూశామని సెంట్‌కామ్ ప్రతినిధి చెప్పారు. అయితే, ఇరాన్ వలె తాము ఎప్పటికీ పౌర నివాసాలను టార్గెట్ చేయబోమని స్పష్టం చేశారు.

ఘర్షణలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో హోర్ముజ్‌లో నౌకల రాకపోకలు తగ్గాయని షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లెర్ పేర్కొంది. గత శుక్రవారం హోర్ముజ్ మీదుగా 19 నౌకలు ప్రయాణిస్తే మంగళవారం కేవలం 6 నౌకలు మాత్రమే హోర్ముజ్‌ను దాటగలిగాయని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య ఘర్షణలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అంతకుముందు హోర్ముజ్‌లో రోజుకు సగటున 138 సరకు రవాణా నౌకలు రాకపోకలు సాగిస్తుండేవి.

ఈ వార్తలనూ చదవండి:

యూఎస్, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి.. నేపాల్ డిమాండ్

అమెరికా సైనికుల రాక.. వ్యభిచార గృహాలపై థాయ్‌లాండ్ పోలీసుల రెయిడ్స్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy