Thursday, 05 Aug, 10.40 am ఆంధ్రజ్యోతి

అమరావతి
ఇదేం తీరు..!

'నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌ పనులు చేయించారు. బకెట్‌ క్లీనింగ్‌ యంత్రం ద్వారా పూడిక తీయాలి. కార్మికులు ఎందుకు దిగారో తెలియదు. వారి మృతితో సంస్థకు సంబంధం లేదు. సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం'

- వనస్థలిపురం పద్మావతి కాలనీలో డ్రైనేజీ పైపులైన్‌ క్లీనింగ్‌ పనుల్లో కార్మికుల మరణంపై జీహెచ్‌ఎంసీ అధికారిక ప్రకటన.

'రెండు పడకల ఇళ్ల నిర్మాణ పనులు చేస్తూ గతంలో ఇద్దరు కార్మికులు మరణించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం. మృతుల కుటుంబాలకు మేయర్‌ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల పరిహారం'

- రెండేళ్ల క్రితం కొల్లూరులో జరిగిన ప్రమాద సమయంలో జీహెచ్‌ఎంసీ స్పందన.

కాంట్రాక్టర్‌కు అప్పగించాం.. మాకు సంబంధం లేదని వెల్లడి

పనులు అప్పగిస్తే బాధ్యత ఉండదా

గతంలో ఎందుకు స్పందించారు.. ఇప్పుడెందుకిలా..?

సివరేజీ పైపులైన్‌లో రాత్రి వేళ పనులా..?

సమాచారం లేదనడంలో వాస్తవమెంత..?

వాటర్‌బోర్డుకు అప్పగిస్తారన్న నిర్ణయం నేపథ్యంలో వేగంగా పనులు

పురపాలక శాఖ తీరుపైనా విమర్శలు

కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు

చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ : ఈ రెం డు పనులూ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఓ చోట ప్రమాదం జరిగితే స్పందించి మృతుల కుటుంబాలకు మానవతాదృక్పథంతో ఆర్థిక సాయం చేసిన సంస్థ వనస్థలిపురంలో జరిగిన ఘటనపై విరుద్ధంగా వ్యవహరిస్తోంది. డ్రైనేజీ పైపులైన్‌ శుద్ధి కోసం 15 అడుగుల లోతున్న మ్యాన్‌హోల్‌లోకి దిగిన ఇద్దరు కార్మికులలో ఊపిరాడక ఒకరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటనతో తమకు సంబంధం లేదంటూ జీహెచ్‌ఎంసీ చేతులు ఎత్తేసింది. దీంతో మరణించిన వారి ప్రాణాలకు విలువ లేదా, వారి కుటుంబాల గోడు పట్టదా ఘటన విషయంలో స్పందిస్తే అధికారుల బాధ్యతారాహిత్యం బయటపడుతుందన్న భయమా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అప్పగించి... అశ్రద్ధగా...

అభివృద్ధి, నిర్వహణ పనుల పర్యవేక్షణలో జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ఇది మరో నిదర్శనం. నిర్వహణ.. అభివృద్ధి పనేదైనా కాంట్రాక్టర్లకు అప్పగించాం.. మాకు సంబంధం లేదన్నట్టుగా ఇంజనీరింగ్‌ విభాగం వ్యవహరిస్తోంది. ప్రతిష్టాత్మక వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఆర్‌డీపీ) విషయంలోనూ ఇదే తీరు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ల రూపకల్పన నుంచి పురోగతిలో ఉన్న పనుల పర్యవేక్షణ వరకు అన్నీ కన్సల్టెన్సీలకు అప్పగించారు. మరి జీహెచ్‌ఎంసీలోని ఇంజనీర్లు ఏం చేస్తున్నారంటే.. కమీషన్లు తీసుకొని బిల్లులపై సంతకాలు చేస్తారన్న వ్యాఖ్యలున్నాయి. వనస్థలిపురంలో జరిగిన ప్రమాదం విషయంలో ఇంజనీరింగ్‌ మెయింటెనెన్స్‌ విభాగం పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ పని జరుగుతోంది..? ఎలా చేస్తున్నారన్నది అధికారులు పట్టించుకోవడం లేదని రుజువైంది. ''పద్మావతి కాలనీలో పని జరుగుతోన్న విషయం మాకు తెలియదు. కాంట్రాక్టర్‌ సమాచారమివ్వలేదు'' అని ఇంజనీర్లు చెబుతున్నారు. ఒప్పందం ప్రకారం పనులు ప్రారంభించేప్పుడు సమాచారం ఇవ్వాలని కాంట్రాక్టర్‌కు సంబంధిత అసిస్టెం ట్‌ ఇంజనీర్‌(ఏఈ) చెప్పాలి. కానీ ఇక్కడ పనులు చేస్తోన్న ట్టు ఎందు కు తెలియదో అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు.

బిల్లుల కోసం.. వడివడిగా..

శివారు సర్కిళ్లలో డ్రైనేజీ పైపులైన్ల అప్పగింతకు సంబంధించి జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డుల మధ్య దోబూచులాట జరుగుతోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు వాటర్‌బోర్డుకు బాధ్యతలు ఇచ్చి.. తిరిగి జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. తాజాగా మరోసారి బోర్డుకు అప్పగించాలని నిర్ణయించారు. దీంతో ఆగస్టులో పూడికతీత పనులు పూర్తిచేస్తేనే జీహెచ్‌ఎంసీ నుంచి బిల్లులు తీసుకునే అవకాశముందని భావిస్తోన్న కాంట్రాక్టర్లు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా పనులు చేస్తోన్నట్టు తెలుస్తోంది. పద్మావతీకాలనిలోనూ అదే జరిగిందని సమాచారం. రూ.12.70 లక్షలకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ వీలైనంత త్వరగా పూర్తి చేసే క్రమంలో రాత్రి వేళ కార్మికులను తీసుకువచ్చారని చెబుతున్నారు. 10 నుంచి 12 అడుగుల లోతు ఉన్న 600 ఎంఎం డయా ట్రంక్‌ సీవర్‌ పైపులైన్‌లో మురుగుతోపాటు ఎగువ చెరువుల నుంచి వస్తోన్న వరద కలుస్తోంది. దీంతో ప్రవాహ ఉధృతి పెరిగింది. మ్యాన్‌హోల్‌ మూతలు తీసిన గంట నుంచి రెండు గంటల అనంతరం.. మిథేన్‌ గ్యాస్‌ లేదని నిర్ధారించుకున్నాక పైపులైన్‌లోకి దిగాలి. ఈ విషయం పై అవగాహన లేని కార్మికులు మూత తీసిన వెంటనే లోనికి దిగినట్టు చెబుతున్నారు. మిథేన్‌ గ్యాస్‌.. వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతి చెందారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివార్లలో సివరేజ్‌ బాధ్యతల నిర్వహణ విషయంలో పురపాలక శాఖ తీసుకుంటోన్న నిర్ణయాలపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మురుగు, వరద కలిసి...

గ్రేటర్‌లో 1282 కి.మీల మేర వరద నీటి కాలువలు ఉన్నాయి. 6 వేల కి.మీల మేర డ్రైనేజీ పైపులైన్‌లు న్నాయి. సివరేజ్‌ పైపులైన్లలోకి వరద నీరు, స్ర్టామ్‌ వాటర్‌ డ్రైన్లలోకి డ్రైనేజీ వెళ్లడం నగరంలో సాధారణమై పోయింది. 625 ప్రాంతాల్లో సివరేజ్‌, వరద నీరు కలుస్తున్నట్టు రెండేళ్ల క్రితం వాటర్‌బోర్డు అధికారులు గుర్తించా రు. వేర్వేరుగా మురుగు, వరద నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఆదేశించారు. తాజాగా వాటర్‌బోర్డులో జరిగిన సమావేశంలోనూ ఈ విషయం పై సూచనలు చేశారు. అయినా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మాన్యువల్‌ స్కావెంజింగ్‌ నిషేధం.. యంత్రాలతోనే డ్రైనేజీ పైపులైన్ల క్లీనింగ్‌ చేయాలని కేటీఆర్‌ స్పష్టంగా సూచించారు. అయినా ఇప్పటికీ జెట్టింగ్‌ యంత్రాలతో పనులు చేసే చోట కూడా కార్మికులు పైపులైన్లలోకి దిగుతున్నారు. మాన్యువల్‌ స్కావెంజింగ్‌ నిషేధం అమలుపై జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదు.

అర్ధరాత్రి వరకూ దొరకని ఆచూకీ

వనస్థలిపురం : సాహెబ్‌నగర్‌, పద్మావతి కాలనీ మ్యాన్‌ హోల్లో గల్లంతైన వ్యక్తి ఆచూకీ మంగళవారం రాత్రి 11 అయినా దొరకలేదు. 24 గంటలుగా 100 మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది గాలింపు చర్యలను చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి వరకూ ఆచూకీ లభించకపోవటంతో కుటుంబ సభ్యులు, అధికారులు నిరాశకు లోనవుతున్నారు. ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జడ్సీ ఉపేందర్‌రెడ్డి, ఉప కమిషనర్‌ మారుతి దివాకర్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

కాంట్రాక్టర్‌పై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వాస్తవంగా పూడికతీత పనులు బకెట్‌ క్లీనింగ్‌ యంత్రంతో చేయాలి. కార్మికులు ఎందుకు దిగారో తెలియదు. ఈ విషయంపైనా వివరాలు సేకరిస్తాం. పూర్తి సమాచారం సేకరించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశం మేరకు చర్యలుంటాయి. మరో మృతదేహం గుర్తించడంపై దృష్టి సారించాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్మవహరించిన ఏఈ, డీఈలపై చర్యలుండవా..? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. - ఇంజనీరింగ్‌ విభాగం అధికారి...

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top