Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

హబూబాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Telangana Minister Ponguleti Srinivasa Reddy) వ్యాఖ్యానించారు.

పేదలకు సంక్షేమం అందించడం, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. కేసముద్రంలో మంత్రి పొంగులేటి ఈరోజు (సోమవారం) పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

3,400 ఎకరాలకు పట్టాలు అందిస్తున్నాం..

పేదల దీవెనలు, ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడూ అండగా ఉంటాయని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. నిరంతరం ప్రజలతో కలిసి ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు ఎలాంటి గోస పడ్డారో అందరికీ తెలుసునని అన్నారు. అప్పటి రెవెన్యూ మంత్రిగా ఉన్నవారు ప్రజలను కలిశారా?, ప్రజల సమస్యలు తెలుసుకున్నారా? ఇప్పుడు అలాంటి వారు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈరోజు 780 మంది రైతులకు, సుమారు 1,400 ఎకరాలకు పట్టా పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 3,400 ఎకరాల భూమికి రైతులకు పట్టాలు అందించామని చెప్పారు. నారాయణపురం గ్రామాల్లో అసైన్డ్ భూములకు సంబంధించి సుమారు 150 ఎకరాలకు పట్టాలు అందించేలా కృషి చేస్తానని మాటిచ్చారు.

భూ భారతితో రైతు సమస్యల పరిష్కారం..

ధరణి వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూ భారతి తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి, రైతులకు ఎలాంటి వివాదాలు లేకుండా పట్టా పాస్ పుస్తకాలు అందిస్తామని స్పష్టం చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం, నిరుపేదలకు రేషన్ కార్డులు అందిస్తున్నామని వివరించారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేసీఆర్ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను కూడా తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే తాము ఓట్లు అడుగుతామని చెప్పారు.

రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు..

మహిళల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు ఇప్పుడు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పింక్ కలర్ వాళ్లకు కళ్లు ఉండి కనిపించడం లేదా?, చెవులు ఉండి వినిపించడం లేదా? , ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారికి అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు ఇక గులాబీ పార్టీ నేతలను నమ్మరని చెప్పారు. ప్రజల కష్టాలు తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

/strong>

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy