Tuesday, 03 Mar, 10.35 am ఆంధ్రజ్యోతి

జాతీయం-అంతర్జాతీయం
ఇటు జోరు... అటు పోరు!

  • పెద్దల సభకు అన్నాడీఎంకే కూటమిలో పోటీ

చెన్నై(ఆంధ్రజ్యోతి): పెద్దల సభకు ఎవర్ని పంపాలన్న విషయంలో కూటమి పార్టీలతో చిక్కులు లేకుండా ప్రతిపక్ష డీఎంకే ఠక్కున తేల్చేసింది. అయితే అధికార అన్నాడీఎంకే మాత్రం కూటమి పార్టీల పోరుని ఎదుర్కొంటోంది. తమిళనాడుకు చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌ 1వ తేదీతో ముగియనుండడంతో.. ఆ స్థానాల్లో కొత్త సభ్యుల్ని ఎంపిక చేసేందుకు ఈనెల 26వ తేదీన ఎన్నికలు జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ పదవులు కోసం అన్నాడీఎంకే, డీఎంకే నేతలు పోటీపడుతున్నారు. తమిళ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ప్రకారం ఈ రెండు పార్టీలకు చెరో మూడు పదవులు లభిస్తాయి. ఆ ప్రకారం డీఎంకే సిట్టింగ్‌ ఎంపీ తిరుచ్చి శివ, అందియూర్‌ సెల్వరాజ్‌, ఎన్‌ఆర్‌ ఇళంగో పేర్లను ఖరారు చేసి, రాజ్యసభ ఎన్నికలపై జోరు చూపిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు ఎంపీగా వ్యవహరించడంతో తిరుచ్చి శివకి మరోసారి ఛాన్స్‌ ఇచ్చారు. అలాగే డీఎంకేలో అరుంధతీయులకు తగిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తిని పోగొట్టేలా మాజీ మంత్రి అందియూర్‌ సెల్వరాజ్‌కీ అవకాశం ఇచ్చారు. ఈరోడ్డు జిల్లాకి చెందిన ఆయన 1996 నుంచి 2001 వరకు డీఎంకే ప్రభుత్వంలో హ్యాండ్‌లూమ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక మూడో సభ్యుడు డీఎంకే న్యాయ విభాగం సలహాదారుడిగా ఉన్న ఎన్‌ఆర్‌ ఇళంగో.. మెరీనాతీరంలో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి శరీరాన్ని ఖననం చేసేందుకు హైకోర్టులో పోరాడి గెలిచ్చిన డీఎంకే న్యాయవాదుల్లో ఒకరు. మరో న్యాయవాది విల్సన్‌ 2019లోనే ఎంపీగా ఎంపిక య్యారు. ఇప్పుడు ఎన్‌ఆర్‌ ఇళంగో కూడా రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. నిజానికి మూడింటిలో ఒకటి కూటమి పార్టీలకు కేటాయిస్తారని భావిం చినా.. కూటమి నేతలతో ఎటు వంటి విభేదాలు రానీయకుండా స్టాలిన్‌ తెలివిగా వ్యవహరించారని చెప్పుకుంటున్నారు.

ఆ ఒక్కటీ ఎవరికి దక్కేనో?

ఇక అన్నాడీఎంకే కూటమిలో మాత్రం తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్‌, డీఎండీఎకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌లు తమకు ఒక సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రాజ్యసభ సీట్ల వ్యవహారంలో అన్నాడీఎంకే నిర్ణయాన్ని బట్టి ఈ కూటమిలో కొనసాగాలా, వద్దా అన్నది తేల్చుకునేందుకు కూడా డీఎండీకే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 'అన్నాడీఎంకే కూటమిలో ఉంటూనే పలుమార్లు ఎంపీ సీటు ఇవ్వాలని అడిగాం. ఈసారైనా అన్నాడీఎంకే ఇస్తుందో, లేదో చూడాలి' అని ప్రేమలత కాస్త ఘాటుగానే స్పందించారు. మరోవైపు జీకే వాసన్‌ ఒక అడుగు ముందుకేసి, ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నట్టు సమాచారం. మూడింటిలో రెండు సీట్లను అన్నాడీఎంకే సీనియర్‌ నేతలకే ఇవ్వాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన ఒక సీటుని టీఎంసీ, డీఎండీకేల్లో ఎవరికి ఇస్తారన్నదే సస్పెన్స్‌గా మారింది. అన్నాడీఎంకే నుండి డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై, మాజీ మంత్రి కేపీ మునుసామి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినా ఢిల్లీలో తమకంటూ ప్రాతినిధ్యం ఉండాలన్నది సీఎం యోచనగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top