Dailyhunt
జగమొండి

జగమొండి

సమ్మెలో ఉన్న అంగన్‌వాడీల తొలగింపు

జిల్లాలో 3,301మంది కార్యకర్తలు, ఆయాలకు ఉద్వాసన

ఉద్యోగం నుంచి తీసివేస్తున్నట్లు నోటీసులు

ఆ ఖాళీల్లో కొత్తవారి నియామకానికి 25న నోటిఫికేషన్‌

రేపు బంద్‌కు పిలుపునిచ్చిన కార్మిక, ప్రజాసంఘాలు

పోస్టుల తొలగింపును అడ్డుకుంటాం : అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు

అంగన్‌వాడీల సమ్మెపై ఆది నుంచి మొండివైఖరిని అవలంబిస్తున్న రాష్ట్రప్రభుత్వం అనుకున్నట్లుగానే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించింది. డిమాండ్ల సాధన కోసం 42రోజులుగా పోరాటం చేస్తున్న కార్యకర్తలు, ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఎస్మాను ప్రయోగించి అంగన్‌వాడీల సమ్మెను ఆపాలని చూసింది. అయినా బెదరకపోవడంతో వారి పొట్టకొట్టింది.

ఒంగోలు నగరం, జనవరి 22 : ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని 3,301 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ మేరకు వారికి నోటీసులు జారీచేసే ప్రక్రియను ఐసీడీఎస్‌ అధికారులు చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం 42రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న విషయం విదితమే. ప్రభుత్వం ఇచ్చిన ఎస్మా నోటీసులకు బెదరకుండా వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే విధుల్లో చేరాలని ఎస్మాను ఉటంకిస్తూ అధికారులు కార్యకర్తలు, ఆయాలకు నోటీసులు ఇచ్చారు. వాటిలో పేర్కొన్న గడువు ముగిసింది. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈలోగా అంగన్‌వాడీలు ఉద్యమాన్ని విజయవాడపై కేంద్రీకరించారు. జిల్లా నుంచి కూడా వేలాదిమంది కార్యకర్తలు, ఆయాలు విజయవాడ తరలివెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. వందలాది మందిని అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. ఒంగోలుతోపాటు విజయవాడ వైపు ఉన్న అనేక స్టేషన్లకు అంగన్‌వాడీలను తరలించారు. విజయవాడలో ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేశారు. ప్రభుత్వం ఒకవైపు ఉప్పెనలా తరలివస్తున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయిస్తూనే, మరోపక్క వారిని ఉద్యోగాల నుంచి వెంటనే తొలగించాలని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు స్త్రీశిశు సంక్షేమశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

జిల్లాలో 3,301మంది ఉద్యోగాల నుంచి తొలగింపు

జిల్లాలో మొత్తం 5350 కార్యకర్తలు, ఆయాలు ఉండగా వీరిలో 2,049మంది విధుల్లో చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ఎస్మాను ప్రయోగించినా, నోటీసులు జారీచేసినా విధుల్లో చేరని 3,301 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు స్త్రీశిశు సంక్షేమశాఖ పీడీ మాధురి తెలిపారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని ఆమె తెలిపారు. ఈనెల 25వతేదీనే నోటిఫికేషన్‌ జారీ చేసి కొత్తవారిని నియమించే ప్రక్రియను చేపడతామని తెలిపారు. రేపు బంద్‌కు పిలుపు

రాష్ట్రప్రభుత్వం అంగన్‌వాడీలను ఉద్యోగం నుంచి తొలగించటాన్ని, ఉద్యమాన్ని అణచివేసే దిశగా నిరంకుశంగా వ్యవహరించటాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, అంగన్‌వాడీ యూనియన్లు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఈ బంద్‌ను జిల్లాలో కూడా విజయవంతంగా నిర్వహించేందుకు కార్మికసంఘాల నాయకులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ మొండివైఖరిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే దిశగా వారు సిద్ధమయ్యారు.

తొలగింపును అడ్డుకుంటాం

ప్రభుత్వం తమను ఉద్యోగాల నుంచి తొలగించాలని చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా పోరాటం ఆపేది లేదని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఘంటాపథంగా చెబుతున్నారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరింత ఉద్యమించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని అంటున్నారు. ప్రభుత్వం కళ్లు తెరిపించే విధంగా ఆందోళనను రూపొందిస్తున్నామన్నారు.

ముందస్తు అరెస్టులు.. వెయ్యి మందికి నోటీసులు

అంగన్‌వాడీల ఆందోళనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి కట్టడి చేశారు. దాదాపు 1000 మంది కార్యకర్తలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కడప, తిరుపతి ప్రాంతాల నుంచి విజయ వాడ వెళుతున్న 16 మందిని అదుపులోకి తీసుకొని టూటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. మార్కాపురం, వైపాలెంలో అంగన్‌వాడీలు ఏర్పాటు చేసుకున్న నిరసన శిబిరాలను పోలీసులు బలవంతంగా తొలగించారు. అదేవిధంగా జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేసి 18 మందిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy