Dailyhunt
జగన్ హయాంలో పేదలకు అన్నం లేకుండా చేశారు.. సీఎం ధ్వజం

జగన్ హయాంలో పేదలకు అన్నం లేకుండా చేశారు.. సీఎం ధ్వజం

తూర్పుగోదావరి జిల్లా, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అన్న క్యాంటీన్లు మూసేసి, పేదలకు అన్నం లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో గొడ్డలి పార్టీ ఉందని.. పేదల సమస్యలు పట్టవని ధ్వజమెత్తారు. పేదలకు కడుపునిండా అన్నం పెట్టడానికి జగన్ అండ్ కోకు మనసొప్పదని విమర్శించారు. పేదలకు అన్నం పెట్టలేని పార్టీలు ఉన్నా ఒక్కటే.. లేకపోయినా ఒక్కటేనని ఆగ్రహించారు. వైసీపీ అధికారంలోకి వస్తే అందరినీ నరుకుతామని, నరబలి ఇస్తామని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయని దుయ్యబట్టారు. ఇక్కడ ఉన్నది 1995 సీబీఎన్.. ఆ గొడ్డలి పార్టీ ఆగడాలను సాగనివ్వనని సీఎం హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి వ్యతిరేకించినందుకు నిరసనగా ఈ రోజు(శనివారం) నిడదవోలులో ఎన్డీఏ కూటమి పక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

మహిళా సాధికారతలో ఏపీ ముందంజలో ఉంది..

మహిళా సాధికారతలో ఏపీ ముందంజలో ఉందని సీఎం చంద్రబాబువ్యాఖ్యానించారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే కాంగ్రెస్ అడ్డుపడిందని పేర్కొన్నారు. ఈ పోరాటానికి దేశవ్యాప్త నిరసన నిడదవోలు నుంచి మొదలైందని తెలిపారు. నిడదవోలు పర్యటన చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును మోదీ 2023లో తీసుకువచ్చారు..

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2023లో తీసుకువచ్చారని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఈ బిల్లు అమల్లోకి రావాలంటే, 2026లో జనగణన జరగాల్సి ఉందని తెలిపారు. అలాంటి బిల్లుకు ఇండియా కూటమి నేతలు ఎందుకు మద్దతు ఇవ్వలేదని నిలదీశారు. దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో నష్టం జరుగుతోందని ఇండియా కూటమి నేతలు అంటున్నారని.. ఈ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పారని తెలిపారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తనకు బాధ వేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల్లో ఎన్టీఆర్ రిజర్వేషన్లు కల్పించారు...

మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, సమాన ఆస్తి హక్కును దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు కల్పించారని ఉద్ఘాటించారు. ఏపీ డ్వాక్రా మహిళలు దేశ వ్యాప్తంగా నెంబర్ వన్‌గా పనిచేస్తున్నారని ప్రశంసించారు. వరకట్న సమస్య పోయిందని చెప్పుకొచ్చారు. ఆడబిడ్డలే భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంటే, అది ఆడబిడ్డల శక్తి అని తెలిపారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అనుకుని ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో పాసయ్యేదని.. కానీ ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఈ నాటిది కాదని చెప్పుకొచ్చారు.

మహిళలకు కాంగ్రెస్ న్యాయం చేయలేదు..

మహిళలకు ఎప్పుడు న్యాయం చేయని పార్టీ, ద్రోహం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. మహిళలకు రిజర్వేషన్లు వచ్చేవరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో, 2024లో వచ్చిన మెజార్టీ ఎప్పుడూ చూడలేదని ప్రస్తావించారు. ఆడబిడ్డలను చట్టసభల్లో చూడాలనేదే తన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. మహిళలకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలను మనుగడ సాగించకుండా చేయాలని అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తాను తీసుకుంటానని ఎన్నికల ముందు చెప్పానని తెలిపారు. 'మన ఇల్లు - మన వీధి - మన ఊరు' అనే ఆలోచన ప్రజలకు రావాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర కోసం 15 నెలలుగా కష్టపడుతున్నానని పేర్కొన్నారు. ఈ శనివారం 'జలధార - జలహారతి' అనే థీమ్‌తో ముందుకు వచ్చానని.. వంద రోజుల కార్యాచరణతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

చెత్తను సేకరించే బాధ్యతను తీసుకుంటా..

త్వరలోనే రాష్ట్రంలో నూటికి నూరు శాతం చెత్తను సేకరించే బాధ్యతను తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. చెత్తే మన సమస్య.. మన ఆరోగ్యానికి సమస్య అని చెప్పారు. 13 నగరాల్లో స్వీపింగ్ యంత్రాలను తీసుకువస్తున్నామని.. టెండర్లు పిలిచామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని ఉద్ఘాటించారు. ప్రతీనెల పేదల సేవలో 60 లక్షల మందికి, ఏడాదికి రూ.33వేల కోట్లతో పెన్షన్లు ఇస్తున్నామని వివరించారు. అక్వాకల్చర్‌ను పరిశ్రమగా తీసుకెళ్లాలని సూచించారు. అక్వా కల్చర్‌తో కొంత కాలుష్య సమస్యలు వస్తున్నాయని ప్రస్తావించారు. ఆ కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుని, అక్వాను అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. గోదావరి పుష్కరాలను మూడోసారి నిర్వహించే అదృష్టం తనకే దక్కిందని అన్నారు. పుష్కరాల కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి రాజధానిగా కేంద్రం ఓ బిల్లు తెచ్చిందని పేర్కొన్నారు.

త్వరలోనే ఆకస్మిక తనిఖీలకు వస్తా..

సీఎం చంద్రబాబు నిడదవోలు పర్యటనలో తక్కువ అభివృద్ధి చూపించిన శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఆకస్మిక తనిఖీలకు వస్తానని తెలిపారు. బాగా పనిచేస్తే అభినందిస్తానని.. లేకపోతే పని నేర్పిస్తానని.. అప్పటికీ బాగాలేకపోతే.. ఇక బాగుండదని హెచ్చరించారు. అధికారులు, తాను ప్రజలకు సేవకులం మాత్రమేనని.. పెత్తందార్లం కామని స్పష్టం చేశారు. కొన్ని శాఖలకు వ్యసనాలు ఉన్నాయని.. ఆ వ్యసనాలు పోవాలని సీఎం చంద్రబాబు మందలించారు.

.

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

నారీ శక్తి వందన్ బిల్లుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి.. మంత్రి సత్యకుమార్ ధ్వజం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy