Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jagitiala :  మత్స్య శాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు

Jagitiala : మత్స్య శాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు

-సంవత్సరాలుగా భర్తీ కాని 13 పోస్టులు

-క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలు

-మత్స్యకార పథకాల పర్యవేక్షణకు తీవ్ర ఆటంకం

గిత్యాల, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మత్స్య శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.

సంవత్సరాలుగా ఖాళీలు భర్తీ కాకపోవడం వల్ల క్షేత్ర స్థాయిలో మత్స్య కారులకు అందాల్సిన ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు, చేప పిల్లల పంపిణీ, ఇతర పనుల పర్యవేక్షణకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కొన్ని సంవత్సరాలుగా డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్ల స్థాయి పోస్టుల్లో పదోన్నతులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు (ఎఫ్‌డీఓ), అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, క్షేత్ర స్థాయి సిబ్బంది పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నాయి. అవసరమైన స్థాయిలో నియామక నోటిఫికేషన్లు వెలువడకపోవడం, కొన్ని నోటిఫికేషన్లు న్యాయపరమైన చిక్కుల్లో పడడం నిరుద్యోగులను నిరాశ పరుస్తోంది.

ఫజిల్లాలో మత్స్య శాఖ పరిస్థితి ఇలా..

జిల్లా వ్యాప్తంగా 275 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 19,220 మంది సభ్యులున్నారు. ఇందులో 88 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 4,217 మంది మహిళలు, 187 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 15,003 మంది పురుష మత్స్య కారులు సభ్యులుగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 511 గ్రామ పంచాయతీ చెరువులకు 3,130 హెక్టార్ల విస్తీర్ణం, 185 డిపార్ట్‌మెంట్‌ చెరువులకు 15,162 హెక్టార్ల విస్తీర్ణం ఉంది.

ఫమత్స్య శాఖలో ఖాళీలు..

జిల్లాలో ఒకరు జిల్లా మత్స్యశాఖ అధికారి పనిచేస్తున్నారు. ఆయన పరిధిలో ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, ఇద్దరు ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు, ఒకరు జూనియర్‌ అసిస్టెంట్‌ పనిచేస్తున్నారు. కాగా జిల్లాలో 8 మంది ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, రెండు ఫిషరీస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఒక కాంట్రాక్ట్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా గతంలో ఉమ్మడి జిల్లా సమయంలో ధర్మపురిలో సహాయ మత్స్య పర్యవేక్షణ అఽధికారి కార్యాలయం నిర్వహిస్తుండేవారు. ధర్మపురి కార్యాలయంలో జిల్లా సహాయ మత్స్య పర్యవేక్షణ అధికారి, కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఇరువురు ఫిషరీస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనిచేస్తుండడం జరుగుతుండేది. అయితే రాష్ట్రంలో కొత్తగా జోన్‌ల పునర్విభజన జరిగిన సమయంలో సుమారు 2021 సంవత్సరంలో ధర్మపురిలో గల సహాయ మత్స్య పర్యవేక్షణ అధికారి పోస్టును బాసర జోన్‌ పరిధి నుంచి సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేశారు. కార్యాలయంలోని పోస్టులు ఇతర జిల్లాలకు సర్దుబాటు చేశారు. దీంతో ధర్మపురిలోని సహాయ పర్యవేక్షణ అధికారి కార్యాలయం మూతపడింది. జిల్లాలో సహాయ మత్స్య పర్యవేక్షణ అధికారి పోస్టు ఖాళీగా ఉంది.

ఫఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు

ఒకే అధికారి రెండు, మూడు ప్రాంతాలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) లాంటి భారీ పథకాలు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు చేరడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. చెరువుల్లో చేపల పెంపకం, ఉచిత చేప పిల్లల పంపిణీ, మత్స్యకారుల సంక్షేమ సంఘాల పర్యటేక్షణ, లైసెన్సుల జారీ ప్రక్రియ మందగిస్తోంది. మత్స్య సంపద పెంపకం, చెరువుల లీజింగ్‌, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి అధికారుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో నీటి నాణ్యతను పరీక్షించడం, చేప పిల్లల పంపిణీ, ఇంటిగ్రేటెడ్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ (ఐఎఫ్‌డీఎస్‌) వంటి పథకాలు, పర్యవేక్షణకు అవసరమైన ఫీల్డ్‌ సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉంది. జిల్లా మత్స్య శాఖ అధికారి (డీఎఫ్‌ఓ) పరిధిలో పనిచేయాల్సిన సబ్‌ డివిజనల్‌ సిబ్బంది, సీనియర్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులు చాలా వరకు ఖాళీ ఉన్నాయి. దీంతో జిల్లాలో మత్స్యకార సొసైటీల నమోదు, సభ్యత్వాల నమోదు ప్రక్రియలకు ఎక్కువ సమయం పడుతోంది.

మత్స్యశాఖలో ఖాళీలు భర్తీ చేయాలి

- మర్రి నర్సయ్య, మత్స్య కార్మిక సంఘ నాయకుడు

జిల్లా మత్స్య శాఖలో ఖాళీగా పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. దీంతో పాటు కొత్తగా అవసరమైన పోస్టులు మంజూరు చేయాలి. అత్యవసరంగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ప్రతిపాదికనైనా పోస్టులను భర్తీ చేయాలి. పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడి మత్స్య కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

- సురేశ్‌, జిల్లా మత్స్య శాఖ అధికారి

జిల్లాలో మత్స్య శాఖ కార్యాలయంలో పలు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. పోస్టులు భర్తీ అయితే పనులు మరింత వేగవంతంగా అయ్యే అవకాశాలున్నాయి. మత్స్య కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy