Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
.Jagitiala :  మోగనున్న బడి గంట

.Jagitiala : మోగనున్న బడి గంట

- నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

- పంపిణీకి సిద్ధంగా పాఠ్యపుస్తకాలు

- జిల్లాలో 1,56,452 మంది విద్యార్థులు

గిత్యాల, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో వేసవి సెలవులు ముగియడంతో పాఠాలతో, పుస్తకాల బ్యాగులతో దోస్తీ కట్టే వేళయింది..

సోమవారం గణగణమంటూ బడి గంట మోగనుంది.. స్నేహితులతో జత కట్టి పాఠశాలకు వెళ్లే క్షణం రానే వచ్చింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో కొత్త విద్యా సంవత్సరంపై ఉత్సాహం నెలకొంది. కొత్త తరగతులు, కొత్త పుస్తకాలు, కొత్త లక్ష్యాలతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లనున్నారు. మరో వైపు వేసవి సెలవుల అనంతరం తమ పిల్లలను క్రమంగా చదువుల వైపు మళ్లించేందుకు తల్లిదండ్రులు సన్నద్ధం చేస్తున్నారు.

ఫసిద్ధమవుతున్న స్కూళ్లు..

ఉపాధ్యాయులు కూడా కొత్త విద్యా సంవత్సరానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాలల్లో తరగతి గదుల పరిశుభ్రత, బెంచీలు, బ్లాక్‌ బోర్డులు, తాగునీటి సౌకర్యం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు నమోదు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పటికే బడి బాట పూర్తి చేసుకున్నారు. విద్యా సంవత్సరం మొదటి రోజు విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. కాగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, మంచినీటి వసతి కల్పించాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఉపాధ్యాయుల సంఖ్య, తదితర సౌకర్యాలు కల్పించడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.

ఫ నిపుణుల సూచనలు

వేసవి సెలవుల తర్వాత ఒక్కసారిగా చదువుల ఒత్తిడిలోకి వెళ్లకుండా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కొత్త విద్యా సంవత్సరం ఉత్సాహంగా, ప్రశాంతంగా మొదలు పెట్టేలా చేయాలని సూచిస్తున్నారు. సమయ పాలన, క్రమ శిక్షణ, ఆరోగ్య కరమైన ఆహారం, సరిపడా నిద్ర వంటి అంశాలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.

ఫకొత్త పుస్తకాలు, బ్యాగులు..

సెలవుల్లో హాయిగా గడిపిన విద్యార్థులు ప్రస్తుతం మళ్లీ చదువుల ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. కొత్త విద్యా సంవత్సరం కొత్త బ్యాగులు, యూనిఫాంలు, షూస్‌, నోట్‌ బుక్స్‌, పాఠ్యపుస్తకాల సందడి నెలకొంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 64 వేల మంది విద్యార్థులకు 5,11,294 పాఠ్యపుస్తకాలు అవసరమని విద్యాశాఖ సిద్ధం చేసింది. సంబంధిత పుస్తకాలను ఇప్పటికే మండల వనరుల కేంద్రాలకు అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేసింది. పాఠశాలలు తెరిచే రోజున విద్యార్థులకు కొత్త పుస్తకాలను అందించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా విద్యా సామాగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. చాలా వరకు ప్రైవేటు స్కూళ్లు పుస్తకాలను విక్రయిస్తున్నాయి.

ఫఫీజుల భారంతో బెంబేలు..

పాఠశాలలు పునఃప్రారంభం ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల్లో గుబులు రేపుతోంది. ఫీజుల మోత మోగుతుండడమే ఇందుకు కారణం. జిల్లాలో సుమారు 292 వరకు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలున్నాయి. తాము అమలు చేస్తున్న సిలబస్‌కు సంబంధించిన పుస్తకాలు బయట ఎక్కడా దొరకవని, వీటితో పాటు నోటు పుస్తకాలు సైతం పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలనే కొన్ని పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు పెడుతున్నాయి. దీంతో చేసేది లేక తల్లిదండ్రులు అక్కడే పాఠ్యపుస్తకాలు కొంటున్నారు. కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల ఫీజులపై ప్రత్యేక ఆడిట్‌ నిర్వహించి అదనపు వసూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యం

- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, తరగతి బోధన, ఉపాధ్యాయుల నియామకం వంటి వాటిపై దృష్టి సారించాం. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.

జిల్లాలో పాఠశాలల వివరాలు..

--------------------------------------------------------------------------------

మేనేజ్‌మెంట్‌.. పాఠశాలలు....బాలురు ....బాలికలు...మొత్తం విద్యార్థులు

--------------------------------------------------------------------------------

ప్రభుత్వ - 33 - 1,499 - 1,699 - 3,198

టీజీఆర్‌ఈఐఎస్‌ - 2 - 504 - 647 - 1,151

కేజీబీవీ - 16 - 0 - 3,319 - 3,319

బీసీ వెల్ఫేర్‌ - 7 - 1,674 - 1,488 - 3,162

మైనార్టీ వెల్ఫేర్‌ - 5 - 805 - 687 - 1,492

సోషల్‌ వెల్ఫేర్‌ - 5 - 1,369 - 1,063 - 2,423

ట్రైబల్‌ వెల్ఫేర్‌ - 5 - 70 - 315 - 385

లోకల్‌ బాడీ - 705 - 22,225 - 21,068 - 43,293

మోడల్‌స్కూల్స్‌ - 13 - 3,229 - 4,989 - 8,218

యూఆర్‌ఎస్‌ - 1 - 59 - 0 - 59

ఎయిడెడ్‌ - 3 - 34 - 52 - 86

ప్రైవేటు - 92 - 47,024 - 40,001 - 87,025

ప్రైవేటు (సీబీఎస్‌ఈ) - 3 - 1,498 -1,143 - 2,641

--------------------------------------------------------------------------------

మొత్తం - 1,090 - 79,981 - 76,471 - 1,56,452

--------------------------------------------------------------------------------

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy