Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనం విజ్ఞతకు జగన్‌ పరీక్ష!

జనం విజ్ఞతకు జగన్‌ పరీక్ష!

సంప్రదాయ రాజకీయాలు చేసేవారు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు గతంలో చేసిన తప్పులను సమీక్షించుకుంటారు. అటువంటి తప్పులు పునరావృతం కానివ్వబోమని భరోసా కల్పిస్తూ ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనడానికి ప్రయత్నిస్తారు.

జగన్‌ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

జగన్‌ రెడ్డి రాజకీయాలు అంచనాలకు అందవు. అడుగడుగునా వంచన ఉంటుంది. ప్రజలు ఆ విషయం తెలుసుకొనే లోపే ఆయన మరో అస్ర్తాన్ని జనం మీదకు వదులుతారు.

జగన్‌ మనసులో ఏముందో తెలియక, మావిగన్‌ను ఎలా సమర్థించాలో తెలియక ఆయన పార్టీ నాయకులు సతమతమవుతున్నారు. మూర్ఖంగా మాత్రమే మావిగన్‌ను ఎన్నికల అజెండాగా ప్రకటించారని భావించలేము. దీని వెనుక కచ్చితంగా కుట్ర దాగి ఉంటుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలతో రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మరో ఏడాదిలో నిర్మాణాలు పూర్తవుతాయి. ఈ దశలో మావిగన్‌ అని ప్రకటించడమే వింత అని అనుకుంటే, ఇప్పుడు మళ్లీ విజయవాడ చాలదా? అని అంటున్నారు. రాజధానితో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంతలా పరాచికాలు ఆడటం ఏమిటి?

కూటమి సమష్టిగా ఉన్నంత వరకు తన పప్పులు ఉడకవని గ్రహించిన జగన్‌ రెడ్డి ఇప్పుడు కూటమికి అండగా ఉంటున్న వర్గాలను దూరం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు మధ్య విభేదాలు సృష్టించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో... ఇప్పుడు ఓటర్లలో చీలిక తెచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.

జగన్‌ రెడ్డి భావిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కేవలం కులం-మతం కోసమే బతుకుతారని భావించలేం. అలా అయితే 2024 ఎన్నికల్లో కుల మతాలకు అతీతంగా కూటమికి మద్దతు ప్రకటించి ఉండేవారు కారు. రాజకీయ పార్టీలకంటే ఓటర్లు ఎక్కువ విజ్ఞతతో వ్యవహరిస్తారని అనేక ఎన్నికలు రుజువు చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల విజ్ఞతకు పరీక్ష పెడుతూనే ఉన్నారు. ప్రజల బలహీనతలను ఔపోసనపట్టిన ఆయన, అందుకు తగ్గట్టుగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ పనిలో పనిగా ఆ ప్రజలకే పరీక్ష పెడుతున్నారు. జగన్‌రెడ్డి మొదటి నుంచీ సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగానే అడుగులు వేస్తున్నారు. తండ్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన ఆయన కాంగ్రెస్‌ పార్టీతో విభేదించి... సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని కులం-మతం ప్రాతిపదికన సొంత ఓటు బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక్క చాన్స్‌ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో పరిపాలించి... 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ తను ఎంచుకున్న మార్గాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు. అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న తనను ముఖ్యమంత్రిని చేసిన ప్రజల బలహీనతలను గుర్తించిన జగన్‌రెడ్డి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల ఆ బలహీనతలనే నమ్ముకున్నారు. అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడదీసి అధికారంలోకి వచ్చిన తాను... మళ్లీ అదే బాటలో అధికారంలోకి రాకపోతానా అని నమ్ముతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తన చర్యలను ఎవరు ఎంతగా విమర్శించినా 40శాతం ఓట్లు పొందగలిగిన తాను ప్రజలను మరింతగా విడదీయగలిగితే 2029లో తిరిగి అధికారంలోకి రాకపోతానా అన్న ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోంది. సంప్రదాయ రాజకీయాలు చేసేవారు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు గతంలో చేసిన తప్పులను సమీక్షించుకుంటారు. అటువంటి తప్పులు పునరావృతం కానివ్వబోమని భరోసా కల్పిస్తూ ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనడానికి ప్రయత్నిస్తారు. జగన్‌రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రెండంటే రెండు నెలలు మాత్రమే మౌనంగా ఉండి... ఆ తర్వాత ప్రజలను విడగొట్టే విధానం అమలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు కొత్తగా నరుకుతాం-చంపుతాం అని రప్పా రప్పా నినాదాన్ని అందుకొని ప్రజలను కూడా భయపెట్టడానికి వెనుకాడటం లేదు.

మావిగన్‌ అజెండా...

అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడానికి మొదటి నుంచీ విముఖంగా ఉన్న జగన్‌రెడ్డి, తాజాగా మావిగన్‌ అంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అజెండా కూడా మావిగన్‌ అని కుండబద్దలు కొట్టారు. మావిగన్‌ అనే పేరే ఎబ్బెట్టుగా ఉందని పలువురు అభిప్రాయపడినప్పటికీ జగన్‌రెడ్డి అదే పాట పాడటమే కాకుండా అమరావతి కావాలనుకొనేవారు తెలుగుదేశం పార్టీకి, మావిగన్‌ కావాలనుకొనేవారు వైసీపీకి ఓటువేస్తారని ప్రకటించారు. సంప్రదాయ రాజకీయాలు చేసేవారు ఇలాంటి ప్రకటనలు చేయరు. ''పద్ధతీపాడూ లేకుండా మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా ప్రధాన రహదారి వెంట రాజధానిని ఏర్పాటు చేయడమేమిటి? రహదారి పక్కన డాబాలు ఉన్నట్టుగా ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయా?'' అని విజ్ఞులు ఈసడించుకుంటున్న విషయం తెలిసి కూడా జగన్‌రెడ్డి మావిగన్‌ను ఎన్నికల అజెండాగా ప్రకటించారంటే అది సాహసమో, దుస్సాహసమో తెలియని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాజధానిని నిర్మించుకోవడం కంటే కులం-మతం ముఖ్యమని జగన్‌రెడ్డి బలంగా నమ్ముతున్నట్టు ఉంది. ఈ నమ్మకంతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత... అప్పటికే రాజధానిగా ప్రకటించిన అమరావతిలో నిర్మాణాలు నిలిపివేసి మూడు రాజధానులు అని ప్రకటించారు. ఇప్పుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ కేంద్రం పార్లమెంటులో చట్టం చేసినా ఖాతరు చేయకుండా మావిగన్‌ అనే ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారు. జగన్‌రెడ్డి రాజకీయాలు అంచనాలకు అందవు. అడుగడుగునా వంచన ఉంటుంది. ప్రజలు ఆ విషయం తెలుసుకొనే లోపే ఆయన మరో అస్ర్తాన్ని జనం మీదకు వదులుతారు. 2019 వరకు అమరావతిపై చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మడంతో జగన్‌రెడ్డిలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అయితే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు తత్వం బోధపడింది. ఈ కారణంగానే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినా 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా వైసీపీని తుక్కు తుక్కుగా ఓడించారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలోకి పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. అక్కడ అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఉత్తరాంధ్ర ప్రజలు సహజంగానే ఈ పరిణామాల పట్ల సంతోషంగా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు విశాఖను కూడా కాదని మావిగన్‌ పేరిట రాజధాని ఏర్పాటవుతుందని జగన్‌ ప్రకటించడంలోని ఆంతర్యం వైసీపీ నాయకులకే అంతుపట్టడం లేదు. మావిగన్‌ అనే మాట తొలుత జగన్‌ నోటి నుంచి వెలువడినప్పుడు ఆయన వెటకారంగా ఆ మాట అని ఉంటారని అందరూ భావించారు. అయితే, రాజకీయ పరిశీలకుల అంచనాలకు భిన్నంగా ఆయన అదే మాటకు కట్టుబడి ఉండటమే కాకుండా ఇప్పుడు ఏకంగా మావిగన్‌ను ఎన్నికల అజెండాగా ప్రకటించారు. ఇలా ప్రకటించడం ఆత్మహత్యా సదృశం అని వైసీపీకి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ జగన్‌రెడ్డి లెక్క చేయడం లేదంటే ఆయన మనసులో మరేదో కుట్ర దాగి ఉందని భావించాలి. ఆయన మనసులో ఏముందో తెలియక, మావిగన్‌ను ఎలా సమర్థించాలో తెలియక ఆయన పార్టీ నాయకులు సతమతమవుతున్నారు. మూర్ఖంగా మాత్రమే మావిగన్‌ను ఎన్నికల అజెండాగా ప్రకటించారని భావించలేము. దీని వెనుక కచ్చితంగా కుట్ర దాగి ఉంటుంది. అయితే, గతంలో అమరావతికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారాన్ని నమ్మి మోసపోయిన ప్రజలు మళ్లీ ఇప్పుడు మావిగన్‌ ప్రచారాన్ని నమ్మి మోసపోతారా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

తేలిగ్గా తీసుకోలేం...

మావిగన్‌ అనే పదమే వినడానికి ఎబ్బెట్టుగా ఉంది. ఈ పేరును ప్రజలు కూడా ఎగతాళి చేస్తున్నారు. దీనిపై ట్రోలింగ్‌ కూడా బాగానే జరిగింది. అయినా జగన్‌రెడ్డి దాన్నే పట్టుకొని వేలాడుతున్నారంటే ఏదో కుట్ర దాగి ఉండకపోతుందా అన్న అనుమానాలు సహజంగానే తలెత్తుతున్నాయి. మావిగన్‌ ప్రతిపాదన చేసిన జగన్‌రెడ్డిని మతిస్థిమితం లేని వ్యక్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించినప్పటికీ... అలా తేలిగ్గా తీసిపారేయలేం. కుట్రలు, కుయుక్తులు జగన్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య కనుక ఏదో కుట్రపూరిత ఆలోచన లేకుండా ఆయన ఇలాంటి అజెండాను ఎత్తుకుంటారని ఎలా అనుకోగలం? మామూలుగా అయితే ఇలాంటి చెత్త ప్రతిపాదన చేసినవాళ్లు రాజకీయంగా నష్టపోతారు. ప్రజలు కూడా ఏవగించుకుంటారు. జగన్‌రెడ్డి అదృష్టమో, రాష్ట్రం చేసుకున్న దురదృష్టమో తెలియదుగానీ మావిగన్‌లాంటి చెత్త ప్రతిపాదనను బలపరుస్తున్నవారు కూడా రాష్ట్రంలో ఉన్నారు. జగన్‌రెడ్డిని అభిమానించే అంధ భక్తులు చాలా మందే ఉన్నారు. సోషల్‌ మీడియాలో వివిధ ముసుగులు వేసుకొని ఆయనకు మద్దతు ఇస్తున్నవారు మావిగన్‌ను విమర్శించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రజల బలహీనతను ఔపోసన పట్టినందువల్లనే జగన్‌రెడ్డి ఇలాంటి విచిత్ర ప్రతిపాదన చేసి కూడా ప్రజల్లో తిరగగలుగుతున్నారు. రాష్ట్ర ప్రజలకు రాజధాని కంటే కులం-మతం మాత్రమే ముఖ్యమని జగన్‌రెడ్డి గుర్తించినందునే ఈ దుస్సాహసానికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలతో రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మరో ఏడాదిలో నిర్మాణాలు పూర్తవుతాయి. ఈ దశలో మావిగన్‌ అని ప్రకటించడమే వింత అని అనుకుంటే, ఇప్పుడు మళ్లీ విజయవాడ చాలదా? అని అంటున్నారు.

రాజధానితో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంతలా పరాచికాలు ఆడటం ఏమిటి? మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న వ్యక్తి ఇంత అపసవ్యంగా ఆలోచించడం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే జగన్‌రెడ్డిది అంతుపట్టని మనస్తత్వం అని సమాధానం చెప్పుకోవాలి. అయితే, ఇది తమ విజ్ఞతకు జగన్‌రెడ్డి పెడుతున్న పరీక్ష అని ప్రజలు గ్రహించగలుగుతున్నారా? అన్నదే ఇప్పుడు మౌలికమైన ప్రశ్న. జగన్‌రెడ్డి ఆడుతున్న ఈ వికృత క్రీడకు అడ్డుకట్ట వేయగల శక్తి ప్రజలకు మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు విజ్ఞత లేదని భావించలేం. విజ్ఞత కలవారు కనుకనే 2019లో మోసపోయామని గ్రహించి 2024లో జగన్‌రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించారు. అయినా ప్రజల వివేకాన్ని గుర్తించడానికి జగన్‌రెడ్డి నిరాకరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా 40శాతం ఓట్లు తనకు రావడమే జగన్‌రెడ్డి ధీమాకు కారణం కావొచ్చు. ఈ ఓటు బ్యాంకు చెక్కుచెదరదనీ, దీనికి ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే అధికారంలోకి రాకపోతామా? అన్న ధీమాతోనే జగన్‌రెడ్డి మావిగన్‌ వంటి దిక్కుమాలిన ప్రతిపాదనను చేసి ఉండవచ్చు. అయితే, ప్రజల విజ్ఞతను తక్కువ అంచనా వేసిన ఏ రాజకీయ నాయకుడూ బాగుపడిన దాఖలాలు లేవు. బటన్లు నొక్కితే చాలు ఓట్లు రాలతాయని భావించడం వల్లనే కదా 2024లో జగన్‌ దారుణంగా ఓడిపోయారు?

కులం చుట్టూ...

రాజధాని అనేది రాష్ర్టాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది, ఉండాలి కూడా! అలా అభివృద్ధి చెందిన నగరాలు రాజధానులుగా ఉన్న రాష్ర్టాలే ధనిక రాష్ర్టాలుగా పేరొందిన విషయం విస్మరించకూడదు. అలా కాకుండా మావిగన్‌ వంటి తుగ్లక్‌ ఆలోచనలు చేసే వారిని ప్రజలు ఆదరిస్తారని భావించలేం. 2029 ఎన్నికల వరకు జగన్‌రెడ్డి ఇదే మావిగన్‌ ప్రతిపాదనకు కట్టుబడి ఉండాలని కోరుకుందాం. జగన్‌రెడ్డి మాటలు, చేష్టలు కొన్ని సందర్భాలలో నవ్వు తెప్పిస్తాయి. అంతమాత్రాన ఆయనను పిచ్చివాడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. జగన్‌రెడ్డి అంటేనే ఒక కపట నాటక సూత్రధారి. తాను అమలుచేస్తున్న, చేయాలనుకుంటున్న కుట్రలు, కుతంత్రాలను రాజకీయ ప్రత్యర్థులకు అలవోకగా ఆపాదిస్తుంటారు. మతిస్థిమితం లేని వాడితో రాజకీయం చేయాల్సి వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారుగానీ, జగన్‌రెడ్డికి మతిస్థిమితం లేదనుకుంటే అంతకు మించిన అవివేకం ఉండదు. నేర రాజకీయాలతోపాటు వంచనతో కూడిన రాజకీయాలు చేయడంలో జగన్‌రెడ్డిని మించినవారు తెలుగునాట ఇప్పుడు లేరు. కుల, మత, ప్రాంతాల వారీగా ప్రజలను విభజించి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్‌రెడ్డి మళ్లీ మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకోకుండా ఎందుకుంటారు? అది చేస్తాం, ఇది చేస్తాం... అని ప్రజలను నమ్మించడం కష్టం కనుక వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ఇదే బాటను ఎంచుకుంటారు. అందుకు ఇప్పటి నుంచే దారులు వేస్తున్నారు. కూటమి సమష్టిగా ఉన్నంత వరకు తన పప్పులు ఉడకవని గ్రహించిన జగన్‌రెడ్డి ఇప్పుడు కూటమికి అండగా ఉంటున్న వర్గాలను దూరం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు మధ్య విభేదాలు సృష్టించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో... ఇప్పుడు ఓటర్లలో చీలిక తెచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకుంటున్నారు. తాజాగా జగన్‌ అండ్‌ కో వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ కారణంగా కాపులు గంపగుత్తగా కూటమికి మద్దతు ఇచ్చారన్నది అందరికీ తెలిసిందే.

ఈ కారణంగానే కాపులను పవన్‌ కల్యాణ్‌కు దూరం చేయడం ఎలా? అన్న దానిపై ముందుగా దృష్టి పెట్టి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. విజయవాడలో లాకప్‌లో మృతి చెందిన సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కులం కార్డును తెర మీదకు తెచ్చారు. గతంలో ఇదే సాయికృష్ణను ఉద్దేశించి 'రౌడీ షీటర్‌ చేతిలో యువకుడి మృతి' అని పేర్కొన్న జగన్‌ మీడియాలోనే... లాకప్‌ డెత్‌ జరగగానే కాపు యువకుడి హత్య అని గగ్గోలు పెట్టడం మొదలైంది. అదృష్టవశాత్తు చనిపోయిన సాయికృష్ణతో పాటు ఆ చావుకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుదీ కాపు సామాజిక వర్గమే అయినందున జగన్‌ అండ్‌ కో కుట్రలు పెద్దగా ఫలించలేదు. అదే వేర్వేరు కులాలకు చెందినవారు అయి ఉంటే ఏ స్థాయిలో గొడవలకు పథక రచన చేసి ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు పోలీస్‌ స్టేషన్లలో లాకప్‌ డెత్‌లు తరచుగా జరుగుతుండేవి. ఆ తర్వాత ప్రజా కంటకులుగా మారిన సంఘ విద్రోహ శక్తులు, కరుడుగట్టిన నేరస్థులను ఎన్‌కౌంటర్‌ పేరిట చంపడం మొదలుపెట్టారు. హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు ఈ తరహా ఎన్‌కౌంటర్లు చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దీంతో ప్రజల్లో పోలీసులకు పేరు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. విజయవాడలో లాకప్‌ డెత్‌ జరిగే వరకు సాయికృష్ణ అనే అతను రౌడీ షీటర్‌ అని, అనేక కేసులలో నిందితుడని ప్రజలకు తెలియదు.

జగన్‌ తెచ్చిన నీచమైన జర్నలిజం...

సాయికృష్ణ పేరుకు ముందు 'కాపు' అని ప్రతిరోజూ పేర్కొంటున్న జగన్‌రెడ్డి మీడియా, సీఐ నాగరాజు కూడా కాపు అన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు. లాకప్‌ డెత్‌ అనేది అవాంఛనీయ సంఘటన అనడంలో సందేహం లేదు. ఇలాంటి సందర్భాలలో కుల ప్రస్తావన ఉద్దేశపూర్వకంగా తెస్తున్నారంటే జగన్‌ అండ్‌ కో అంతరంగాన్ని అర్థం చేసుకోవచ్చు. కాపు వర్గానికి చెందిన సీఐ నాగరాజు చేతిలో అదే సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణ మృతి అని రాసి ఉంటే అర్థం చేసుకోవచ్చు. నేరాలకు పాల్పడుతున్నవారు తమ మద్దతుదారులైతే వారి కులం గురించి తెలియకుండా జగన్‌రెడ్డి రోత మీడియా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. బాధితుడు తమ మద్దతుదారుడైన పక్షంలోనే కుల ప్రస్తావన తీసుకురావడం ఆ పత్రికకు వెన్నతో పెట్టిన విద్య. జర్నలిజం అంటే అలాగే ఉండాలని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏదైనా సందర్భంలో నేరం చేసినవాళ్లు తమకు మద్దతు ఇవ్వని వర్గాలకు చెందినవారైతే... వారి వెనుక కులం తోకలు లేకపోయినా తగిలిస్తారు. అదే నేరం చేసినవాళ్లు తమ వాళ్లైతే అప్పటికే ఉన్న తోకను తీసేసి కులం తెలియకుండా జగన్‌ అండ్‌ కో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి నీచమైన జర్నలిజాన్ని ప్రవేశపెట్టిన జగన్‌రెడ్డి ఇతరులను నిందించడం వింతగా ఉంటుంది. రౌడీ షీటర్‌ అయినంత మాత్రాన లాకప్‌లో చిత్రహింసలు పెట్టి చంపాలని ఎవరూ కోరుకోరు. అయితే జరిగిన సంఘటనకు కులం రంగు పులమడం ద్వారా జగన్‌ అండ్‌ కో రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్న విషయం ప్రజలు గ్రహించాలి. అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీలో ఉన్న కాపు నాయకులతో అదే కాపులను తిట్టించిన జగన్‌రెడ్డికి ఇప్పుడు కాపులపై అమాంతం ప్రేమ ఎందుకొచ్చిందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కారు ప్రజలు. కూటమి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడేలా చేయడం కోసమే ఈ విన్యాసాలన్నీ.

తాము ఆశించినట్టుగా జరిగితే సరి... లేదా కాపులకు వ్యతిరేకంగా మిగతా కులాలను సమైక్యపరచడం లక్ష్యంగా జగన్‌రెడ్డి ఎత్తుగడలు ఉన్నాయి. నిన్న - నేడు - రేపు కూడా జగన్‌రెడ్డి ఇదే విధంగా సమాజంలో చీలికలు తేవాలనే ప్రయత్నించారు, ప్రయత్నిస్తారు. ఇలాంటి కుట్రలను ఛేదించి తమను తాము కాపాడుకోవడంతోపాటు రాష్ర్టాన్ని కాపాడుకోవలసిన బాధ్యత విజ్ఞులైన ప్రజల మీదే ఉంటుంది. తాను మళ్లీ అధికారంలోకి వస్తే అరాచక, ఆటవిక పాలనను మళ్లీ తీసుకుని వస్తానని, రాష్ర్టానికి రాజధాని లేకుండా చేస్తానని జగన్‌రెడ్డి చెప్పకనే చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నట్టుగా జగన్‌రెడ్డిని మతిస్థిమితం లేని వ్యక్తిగా భావించి ప్రజలు కూడా పక్కన పెడతారా? లేక ఆయన కుట్రలు, కుతంత్రాలకు ప్రభావితులై మళ్లీ నెత్తిన పెట్టుకుంటారా? అన్నది ప్రజల విజ్ఞతపైనే ఆధారపడి ఉంటుంది. జగన్‌రెడ్డి భావిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కేవలం కులం-మతం కోసమే బతుకుతారని భావించలేం. అలా అయితే 2024 ఎన్నికల్లో కుల మతాలకు అతీతంగా కూటమికి మద్దతు ప్రకటించి ఉండేవారు కారు. రాజకీయ పార్టీలకంటే ఓటర్లు ఎక్కువ విజ్ఞతతో వ్యవహరిస్తారని అనేక ఎన్నికలు రుజువు చేశాయి. ఇకపై కూడా రుజువు చేస్తాయి. జగన్మోహన్‌రెడ్డి పెట్టబోతున్న పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అధిగమిస్తారని ఆశిద్దాం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy