Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాక్రోచ్‌ వెనుక 'లాఫ్టివిజం' వ్యూహం!

కాక్రోచ్‌ వెనుక 'లాఫ్టివిజం' వ్యూహం!

సెర్బియా అధ్యక్షుడు స్లోబోడాన్ మిలోషెవిచ్‌ను అధికారం నుంచి తొలగించిన ఒట్పోర్ ఉద్యమం ప్రధాన నాయకుల్లో స్జ్రా పోపోవిచ్ ఒకరు. ఆయన అభిప్రాయం ప్రకారం- తాము నిరంకుశ పాలనగా భావించే ప్రభుత్వంపై కోపాన్ని ప్రదర్శిస్తే, దానికి ప్రతిగా ఆ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగే అవకాశం ఉంటుంది.

కానీ పోస్టర్లు, మీమ్స్, వ్యంగ్యం, జోకులకు పాలకులు భయపడటం ప్రారంభిస్తే, అదే ప్రభుత్వం ప్రజల దృష్టిలో హాస్యాస్పదంగా, బలహీనంగా కనిపించడం మొదలవుతుంది. ఈ భావనను 'లాఫ్టివిజం' అని పోపోవిచ్ పేర్కొన్నాడు (Laughti-vism = Laugh + Activism). అంటే, నవ్వును ఒక రాజకీయ ఆయుధంగా మార్చడం. 2013లో 'ఫారిన్‌ పాలసీ' పత్రికలో ప్రచురితమైన తన వ్యాసంలో, ''డిలెమా యాక్షన్స్'' (Dilemma Actions) అనే సిద్ధాంతాన్ని పోపోవిచ్ ప్రతిపాదించాడు. అనంతరం, తన 'బ్లూ ప్రింట్‌ ఫర్‌ రివల్యూషన్‌' (Blueprint for Revolution) అనే పుస్తకంలో దీనిని మరింత వివరంగా చర్చించాడు.

తన రచనల్లో స్జ్రా పోపోవిచ్ చెప్పేదేమిటంటే- 'లాఫ్టివిస్టులు' ప్రజలకు ప్రాధాన్యమున్న ఒక సమస్యను సృష్టించాలి లేదా గుర్తించాలి. ఆ తర్వాత, ప్రత్యర్థి ఒక సంకటస్థితిలో పడే విధంగా కార్యాచరణను రూపొందించాలి. అంటే- అహింసాత్మక ఉద్యమాన్ని కొనసాగనివ్వడం లేదా ప్రజాదరణ లేని ఆంక్షలను అమలు చేయాల్సిరావడం వంటి రెండు ఎంపికల మధ్య ప్రత్యర్థిని నిలబెట్టే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వానికి ''గెలిచినా ఓటమే, ఓడినా ఓటమే'' అనే పరిస్థితులను సృష్టించటం, ప్రభుత్వం అంటే భయం పోగొట్టడం, మూకుమ్మడిగా ఎదిరిస్తే ప్రభుత్వాలు ఏమీ చేయలేవని నిరూపించడం, అధినేతలను మీమ్స్ ద్వారా గేలిచేయడం ''లాఫ్టివిజం'' కార్యాచరణలో ముఖ్యమైన అంశాలు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దాని ప్రతికూల ప్రభావం ప్రభుత్వానికే తగిలేలా చూడాలి. ప్రభుత్వం జోకులు లేదా మీమ్‌లను పట్టించుకోకపోతే, ఉద్యమానికి ఆదరణ పెరిగి అది విస్తరిస్తుంది. మరోవైపు, ప్రభుత్వం వాటికి ఆగ్రహించి చట్టపరమైన చర్యలు తీసుకున్నా లేదా అణచివేతకు దిగినా, అదే ప్రభుత్వం అసహనంతో కూడినదిగా, పిరికిదిగా ప్రజల దృష్టిలో కనిపిస్తుంది. దీనినే 'బ్యాక్‌ఫైర్ ఎఫెక్ట్' (Backfire Effect) అంటారు.

సీజేపీ నిరసనల్లో జరిగిన పరిణామాలతో దీనికి ఉన్న పోలికను విస్మరించడం కష్టం. మోదీ ప్రభుత్వం మొదట సీజేపీని పట్టించుకోలేదు. అనంతరం, సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ పేజీని తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశించింది. దీంతో కాక్రోచ్‌లకు వారి మొదటి విజయం లభించింది. కొద్దిరోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 20మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించిన సీజేపీ... ఫాలోవర్స్‌ పోటీలో బీజేపీని అధిగమించామని పేర్కొంది. ప్రభుత్వ నిషేధాన్ని, యువ కాక్రోచ్‌లంటే కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నదనటానికి సంకేతంగా సీజేపీ చిత్రీకరించింది. తర్వాత సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ పేజీపై విధించిన ఆంక్షను తొలగించడం కూడా కేంద్ర ప్రభుత్వానికి తప్పిదంగానే మారింది. మొదట విధించిన నిషేధం ప్రభుత్వాన్ని ఎగతాళికి గురిచేస్తే, తర్వాత ఆ నిషేధాన్ని వెనక్కి తీసుకోవటం- 'ఫాసిస్టు' ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు దిగిందని ప్రచారం చేయడానికి సీజేపీకి అవకాశం కల్పించింది. పోపోవిచ్ కార్యాచరణ నమూనాకు అనుగుణంగానే కాక్రోజ్‌ జనతా పార్టీ ప్రజలకు చర్చనీయాంశమైన నీట్‌ ప్రశ్నపత్రం లీక్ అంశాన్ని ఉద్యమానికి ఎంచుకుంది. 2026 జూన్ మొదటి వారానికి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సీజేపీ నిర్వహించిన ఆన్‌లైన్ ప్రచారం, క్షేత్రస్థాయి 'అహింసాత్మక' నిరసనగా మారింది.

అనేక వారాలపాటు కేంద్ర ప్రభుత్వం సీజేపీ నిరసనను కనీసం గుర్తించలేదు. అలా వదిలేస్తే ఈ 'ఉద్యమం' సహజంగానే క్రమంగా ముగుస్తుందని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. అయితే, ప్రభుత్వ ఈ నిర్లక్ష్య ధోరణి సీజేపీకి తనను తాను సిద్ధం చేసుకోవడానికి, మద్దతుదారులను సమీకరించడానికి, పూర్తి శక్తితో ప్రభుత్వంపై దాడి చేయడానికి అవకాశాన్ని కల్పించింది. సీజేపీ ఎప్పుడైతే నీట్‌ ప్రశ్న పత్రం లీక్‌ అంశాన్ని తీసుకుందో పిల్లలు, పెద్దలు అందరూ దానికి కనెక్ట్ అయ్యారు. మతం, కులం, ప్రాంతం, జాతి, పార్టీలకు అతీతంగా మద్దతు లభించింది. సీజేపీ కూడా ఇంత మద్దతు లభిస్తుందని ఊహించి ఉండదు. ఇదే అదనుగా బీజేపీ వ్యతిరేక, జాతి వ్యతిరేక శక్తులు సీజేపీ వెంట నిలిచాయి.

'నీట్‌' అక్రమాలు బయటపడగానే ప్రభుత్వం కఠినమైన చర్యలకు ఉపక్రమించి ఉంటే సీజేపీ ఆందోళనకు ఇంత మద్దతు లభించి ఉండేది కాదు. నాడు వ్యవసాయ చట్టాలపై ఆందోళన, నేడు నీట్‌ అక్రమాలపై ఆందోళన రెండూ మోదీ ప్రభుత్వం మెడలు వంచాయి. ఇప్పటికైనా కొత్త తరం కొత్త రకపు నిరసన పద్ధతులను ఎంచుకొంటున్నదన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి. యువతరం ఆకాంక్షలకు, ఆశలకు తగ్గట్లుగా పాలనా సంస్కరణల ద్వారా పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చేందుకు పాలకులు కృషి చేస్తారని ఆశిద్దాం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy